ఉలవపాడు (కందుకూరు), న్యూస్‌లైన్: రాష్ట్రం ఒక పక్క భగ్గుమంటూ అతలాకుతలమవుతుంటే ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దీక్ష చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ ధ్వజమెత్తారు. 72 గంటల నిరవధిక బంద్ సందర్భంగా చివరి రోజు ఆదివారం ఉలవపాడులో హైవే దిగ్బంధం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న నూకసాని మాట్లాడుతూ సీమాంధ్రతో పాటు తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా నానా అవస్థలు పడుతుంటే చంద్రబాబు మతిభ్రమించినట్లు మాట్లాడుతున్నాడని, ఆయన వ్యవహార శైలి ఆయన సన్నిహితులకే అంతుపట్టడం లేదన్నారు.
అసలు ఢిల్లీలో దీక్ష ఎందుకు చేస్తున్నారో ఇంత వరకు స్పష్టంగా చెప్పకపోవడం విడ్డూరమన్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ టీడీపీ నాయకులతో కలిసి తెలంగాణ ను విడగొట్టాలని సోనియాకు చెప్పినట్లు స్పష్టమవుతోందన్నారు. ఈ వ్యవహారం టీడీపీ ఎంపీ సీఎం రమేష్, బొత్స సత్యన్నారాయణను అతి రహస్యంగా కలవడంతోనే బయటపడిందన్నారు. ఆ రెండు పార్టీలు కలిసి కుయుక్తులు పన్నుతూ జగన్‌పై వాటిని నెట్టాలని చూడడం ఆకాశంపై ఉమ్మి వేసిన చందంగా ఉంటుందని చెప్పారు. కందుకూరు పార్టీ సమన్వయకర్త తూమాటి మాధవరావు మాట్లాడుతూ 67 రోజులుగా ఆందోళనలు, రాస్తారోకోలు, బంద్‌లు చేస్తూ ఉంటే కాంగ్రెస్ నేతలకు దున్నపోతుపై వాన కురిసిన చందంగా మారిందని విమర్శించారు.
ఢిల్లీలో ఒక మాట, రాష్ట్రానికి వచ్చి మరో మాట చెప్పడం ఆ పార్టీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్యగా మారిందన్నారు. టీ నోట్‌ను వెనక్కు తీసుకోకపోతే పరిస్థితి తీవ్రమవుతుందని ధ్వజమెత్తారు. మరో సమన్వయకర్త ఉన్నం వీరాస్వామి మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల జిల్లాలో తాగు, సాగు నీటి సమస్య జఠిలమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కందుకూరు జేఏసీ నాయకుడు ఆర్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు సమైక్యాంధ్ర విషయంలో స్పష్టమైన వైఖరితో ఉండాలని పిలుపునిచ్చారు. 67 రోజులుగా ఉద్యమం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం అత్యంత హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కొల్లూరి కొండయ్య, రాష్ట్ర పార్టీ బీసీ సెల్ సభ్యుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ బూర్సు మాలకొండయ్య, జేఏసీ నాయకులు గాయత్రి రామకృష్ణ, పెరుగు ప్రసాదు, ఏవీ.రావు, టీజే.విలియంతో పాటు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబుకు మతిభ్రమించింది
Published Mon, Oct 7 2013 3:57 AM | Last Updated on Sat, Jul 28 2018 4:52 PM
Advertisement