
చంద్రబాబు వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కింద వస్తాయని ద్రోణంరాజు రవికుమార్ అన్నారు.
సాక్షి, అమరావతి: బ్రాహ్మణులపై కక్ష కట్టిన సీఎం చంద్రబాబు తన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అనిల్ చంద్ర పునేఠను తాను చెప్పినట్టే వినాలని ఒత్తిడి తెచ్చి ఆయనను బలిపశువును చేశారని, ఆయన స్థానంలో ఎన్నికల సంఘం మరో బ్రాహ్మణ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యంను సీఎస్‌గా నియమిస్తే ఆయననూ అవమానించేలా మాట్లాడారంటూ అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ మండిపడ్డారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసుల్లో ఎల్వీ సుబ్రమణ్యం నిందితుడు కాదంటూ 2018 జనవరిలోనే ఉమ్మడి ఏపీ హైకోర్టు కొట్టివేసిందన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కింద వస్తాయన్నారు. సీఎస్ డీజీపీ కార్యాలయానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెళ్లడమనేది ఎన్నికల ప్రక్రియలో ఒక భాగమని తెలిపారు.
ఎల్వీ సుబ్రమణ్యంను సీఎస్‌గా ఎంపిక చేయడంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారుల సంఘంతో పాటు వివిధ ఉద్యోగుల సంఘాలు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు అడ్వకేట్ జనరల్ వేణుగోపాల్ విషయంలోనూ, రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం విషయంలోనూ వ్యవహరించిన తీరే బ్రాహ్మణులు ఇప్పటికీ మరిచిపోలేకుండా ఉన్నారన్నారు. (చదవండి: సీఎస్‌పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు)