
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి రెండింటినీ ముందుకు తీసుకెళ్తున్నామని, విభజన కారణంగా రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు నీతి ఆయోగ్ సహకారం అవసరమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. విభజన కారణంగా అభివృద్ధికి ఏపీ దూరమైందన్నారు. పరిశ్రమలు, సేవలు, వ్యవసాయ రంగాలే అభివృద్ధికి చోదకాలని చెప్పారు. విశాఖపట్నం, విజయనగరం, కడప ఎదుగుతున్న జిల్లాలుగా ఉన్నాయని వీటితోపాటు శ్రీకాకుళం, ప్రకాశం, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలను కూడా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ఇందుకు 15వ ఆర్థిక సంఘం, నీతిఆయోగ్‌లు ఉదారంగా సాయం చేయాలని కోరారు. సమగ్రాభివృద్ధితో రాష్ట్రాన్ని మోడల్ స్టేట్‌గా తయారు చేయాలని సీఎం గట్టి సంకల్పంతో ఉన్నారని సీఎస్ తెలిపారు.
5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం దిశగా కేంద్రం అడుగులేస్తోందని, రాష్ట్రానికి తగిన రీతిలో సాయమందిస్తే లక్ష్య సాధనలో తాము కూడా పాలుపంచుకుంటామన్నారు. దేశం 10–11 శాతం వృద్ధిరేటు సాధించాలని నిర్దేశించుకున్నందున రాష్ట్రానికి తగినంత తోడ్పాటునందించాలని కోరారు. మంచి వనరులు, నైపుణ్యం, అంకితభావం కలిగిన అధికారులు, దృఢ నిశ్చయం ఉన్న నాయకత్వం తమకు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనేక చర్యలు తీసుకుందని, బహుముఖ ప్రణాళికలతో ముందడుగు వేస్తున్నామని సీఎస్ వివరించారు.
విభజన హామీ అయిన కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. పారదర్శకత విధానా లను తెచ్చామని, గత అసెంబ్లీ సమావేశాల్లో 18 చట్టాలు చేశామని, ఇందులో భాగంగా మొదటిసారిగా జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టాన్ని తెచ్చామని సీఎస్ వివరించారు. వైజాగ్– చెన్నై, చెన్నై – బెంగళూరు కారిడార్లలో క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని, పెట్టుబడులకు కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. కాలుష్య నివారణకు డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడుతున్నామని, ఇందుకు నీతి ఆయోగ్ సహకరించాలని కోరారు.