
విజయవాడలో నోవాటెల్‌ను ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో అలగ్జాండ్రీ జిగ్లర్, ప్రభుకిషోర్ తదితరులు (పక్కన) నోవాటెల్ హోటల్
పటమట (విజయవాడ తూర్పు): అంతర్జాతీయ ప్రమాణాలతో.. అత్యున్నత సౌకర్యాలతో వరుణ్ గ్రూప్ సంస్థ విజయవాడలో నిర్మించిన నోవాటెల్ వరుణ్ హోటల్‌ను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్ ఇండియన్ అంబాసిడర్ అలగ్జాండ్రీ జిగ్లర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అమరావతి కాస్మోపాలిటిన్ సిటీగా మారేందుకు విజయవాడకు చెందిన పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువకులు కృషి చేయటం హర్షణీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని చెప్పారు. నూతన రాజధాని అమరావతిలో మరో నాలుగు ఫైవ్‌స్టార్ హోటళ్లు ఏర్పాటు కానున్నాయని, అకార్ సంస్థ ఈ మేరకు నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందజేస్తామని ప్రకటించారు. తర్వాత నోవాటెల్–వరుణ్–అకార్ సంస్థల మధ్య కుదిరిన ఒప్పదానికి సీఎం చంద్రబాబు హామీగా ఉన్నారు. అనంతరం అలగ్జాండ్రీ జిగ్లర్ మాట్లాడుతూ.. భారతదేశంలో అతిథ్య రంగానికి ప్రత్యేక స్థానం ఉందని, అతిథులకు సౌకర్యం, విలాసవంతంతోపాటు భద్రత కూడా ఇక్కడ ఉండటం శుభపరిణామమన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ రంగం అభివృద్ధి చెందేందుకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. వరుణ్ గ్రూప్ సంస్థల అధినేత ప్రభు కిషోర్ మాట్లాడుతూ.. తాము ఆటోమోబైల్ రంగం నుంచి అతిథ్య రంగంలోకి వచ్చినప్పటి నుంచి అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం, భీమిలి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో హోటళ్లు, కన్వెషన్ సెంటర్లు ఏర్పా టు చేసినప్పటికీ తనకు వెలితి ఉండేదని, సొంత నగరంలో స్టార్ హోటల్ నిర్మించటంతో ఆలోటు తీరిందన్నారు. నోవాటెల్ విజయవాడ వరుణ్ హోటల్ పర్యావరణహిత హోటల్ అని తెలి పారు. విద్యుత్ నుంచి కార్పెట్ వరకు ప్రతిదీ పర్యావరణహితమైన సోలార్, గ్రీనరీ లాంటి కాలుష్యరహిత ప్రమాణాలు పాటిస్తున్నామని చెప్పారు. అంతకుముందు వరుణ్ గ్రూస్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్‌ఆర్) ద్వారా ప్రభుత్వానికి రూ.31 లక్షలు విరాళంగా ఇచ్చింది. కార్యక్రమంలో పలువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment