‘బాబూ.. ఆ సీటు అమ్ముకున్నావా? లేదా..?’ | Minister Jogi Ramesh Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబూ.. ఆ సీటు అమ్ముకున్నావా.. లేదా..?’

Published Thu, Jan 4 2024 8:00 PM | Last Updated on Thu, Jan 4 2024 8:26 PM

Minister Jogi Ramesh Comments On Chandrababu - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబును బీసీలెవ్వరూ నమ్మరని, రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని  రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు. నిన్నటి దాకా తన సొంత సామాజికవర్గం తప్ప మిగతా సామాజిక వర్గాల వారందర్నీ చంద్రబాబు హీనంగా, చులకనగా చూశాడు. ఇప్పుడేమో రేపోమాపో ఎన్నికలగానే మళ్లీ ఆయన వేషం మార్చాడంటూ మంత్రి దుయ్యబట్టారు. పెడనలోని మార్కెట్‌ యార్డులో పింఛన్‌ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే..

బీసీలపై చంద్రబాబు దొంగ ప్రేమ:
మీ తోకలు కత్తిరిస్తాం.. అంతుచూస్తానంటూ.. బీసీల్ని బెదిరించిన ఈ చంద్రబాబు మళ్లీ ఇప్పుడు బీసీలపై దొంగ ప్రేమ కురిపిస్తున్నాడు. ఈ రోజు జయహో బీసీ పేరిట పార్టీ కార్యక్రమం పెట్టుకుని అందులో ఆయనతో పాటు అచ్చెన్నాయుడు, బండారు సత్యన్నారాయణ, ఇంకా కొంతమంది బీసీలకేదో చేసినట్టు పెద్దపెద్దగా రంకేలేస్తున్నారు.  చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు బీసీల విషయంలో ఎంతగా పశ్చాతాప్తం పడ్డా.. వాళ్ల మాటల్ని బీసీలు నమ్మరు గాక నమ్మరు. 

బీసీలకు పెద్దన్నగా జగన్‌కు ఆదరణ:
అణగారిన వర్గాలు, బడుగు, బలహీనవర్గాల్ని గుర్తించి వారిని అన్ని విధాలుగా అభివృద్ధిలోకి తెచ్చి అక్కునజేర్చుకుని బీసీలకు పెద్దన్నగా నిలిచిన సీఎం జగన్‌. అందుకే, ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీసీలంతా జగనన్న పట్ల ఆదరణ చూపుతూ మళ్లీ మా సీఎం నువ్వేనన్నా అని అంటున్నారు. 75 సంవత్సరాల దేశ చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నిలబెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే.. ఏకైక వ్యక్తి వైఎస్‌ జగన్‌ మాత్రమే అని చెప్పుకోవాలి. 

గర్వంగా చెప్పుకుంటున్నాం...
కేబినెట్‌లో 25 మంది మంత్రులుంటే.. అందులో 17 మందిని నాతో సహా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులిచ్చి గౌరవించిన ఘనత మన ముఖ్యమంత్రి జగనన్నకే దక్కుతోంది. 9 రాజ్యసభ స్థానాల్లో 4 స్థానాల్ని బలహీనవర్గాలకు కట్టబెట్టి బీసీల్ని అగ్రస్థానంలో నిలబెట్టి మన ఆత్మగౌరవాన్ని కాపాడిన నాయకులు మా జగనన్న అని మేం గర్వంగా చెప్పుకుంటున్నాం. 

ఎస్సీల రాజ్యసభ్య సీటును అమ్ముకున్న నీచుడు చంద్రబాబు:
చంద్రబాబు రాజ్యాంగ పదవుల నియామకంలో బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపుసోదరులందరినీ మోసం చేశాడు. ఎస్సీ సామాజికవర్గానికి రాజ్యసభ స్థానం కేటాయిస్తామని.. తెలుగుదేశం పార్టీ సీనియర్‌గా ఉన్న వర్ల రామయ్య గారికి కబురు పంపితే.. పాపం, ఆయన భారీ ర్యాలీగా విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజీ దగ్గరకు వచ్చేలోగానే.. ఆ రాజ్యసభ సీటును నీ సామాజికవర్గానికి చెందిన కనకమేడల రవీంద్రనాథ్‌కుమార్‌కు అమ్ముకున్నావా..లేదా..? అనేది చంద్రబాబు సమాధానం చెప్పాలని సవాల్‌ చేస్తున్నాను.

మోసానికి కేరాఫ్‌ చంద్రబాబు:
చంద్రబాబు పేరు చెబితే మోసం గుర్తుకొస్తుంది. సుదీర్ఘ కాలం రాజకీయం అనుభవం ఉందని చెప్పుకుంటున్న ఆయన 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ఒక్క అక్కచెల్లెమ్మల ఖాతాల్లోనైనా ప్రభుత్వం తరఫున ఒక్క రూపాయి జమ చేశాడా..?. డ్వాక్రా అక్కచెల్లమ్మలకు రుణమాఫీ అని చెప్పి చేతులెత్తిపోయాడు. ఆయన ఎగొట్టిన రుణమాఫీని వైఎస్‌ జగన్‌ వచ్చాక అమలు చేసిన పరిస్థితి మీ అందరూ గుర్తుచేసుకోవాలి.  అదే విధంగా రైతుల్ని కూడా రుణమాఫీ పేరిట నిలువునా ముంచిన వ్యక్తి చంద్రబాబు. ఆయన పాదం పెడితేనే పచ్చని పంటలు కూడా నిలువెల్లా మాడిమసైపోతాయి. చంద్రబాబు ఉంటే కరువు.. కరువంటే కేరాఫ్‌ చంద్రబాబు అనేది గుర్తు. 

మానవత్వమే జగనన్న కులం:
అదే మన జగనన్న అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి నేటి వరకు అంటే 2019 నుంచి ఇప్పటి దాకా ప్రతీ అక్కచెల్లెమ్మలు, రైతులు, అవ్వాతాతలు, విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వసంక్షేమం ఎంత జమ అయిందో అందరూ లెక్కగట్టండి. కులం, మతం, రాజకీయం, ప్రాంతం చూడకుండా మన జగనన్న ఇప్పటికీ డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన సొమ్ము అక్షరాలా రూ.2.41 లక్షల కోట్లు. జగనన్న మనసున్న మనిషి. మానవత్వమే ఆయన కులం. కనుకే, ఈరోజు అన్ని సామాజికవర్గాల అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతులు, యువత ఆయన్ను ఆశీర్వదిస్తున్నారు.

ప్రశ్నిస్తానన్న పవన్‌కళ్యాణ్‌ అప్పట్లో ఏం చేశాడు..?:
గతంలో చంద్రబాబు నెరవేర్చని హామీలను ఏనాడైనా ప్రశ్నించావా పవన్‌కళ్యాణ్‌..?. గతంలో మీరిద్దరూ కలిసే పోటీ చేశారు కదా..? ఇళ్ల స్థలం లేని అక్కచెల్లెమ్మలకు మూడు సెంట్ల స్థలం ఇస్తామని ఆనాడు హామీలు ఇచ్చారు. మరి, ఆ హామీలు నెరవేర్చారా? దానిపై ఏనాడైనా నీ దత్తదండ్రి చంద్రబాబును నువ్వు ప్రశ్నించావా..?. రైతు రుణమాఫీ అంటూ రైతుల్ని చంద్రబాబు నట్టేట ముంచితే.. ఆ పాపంలో నువ్వు కూడా భాగస్వామిగా ఉండలేదా..?. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో వాగ్ధానం చేశామని ఎందుకు చేయలేదని చంద్రబాబును ఎప్పుడైనా పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించాడా?

గ్రామగ్రామాన జగన్‌ మార్కు  ఇది:
చంద్రబాబుది దద్దమ్మ పాలన అని పిల్లోడు కూడా చెబుతున్నాడు. అదే మా జగనన్న ముఖ్యమంత్రిగా తన మార్క్‌ను గ్రామగ్రామాన చూపించారు. ఏ గ్రామానికి వెళ్లినా వైఎస్‌ జగన్నన్న మార్క్‌ కనపడుతుంది.  సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్, నాడు–నేడు ద్వారా రూపురేఖలు మారిన స్కూల్స్, 108, 104.. ఇలా సీఎం జగన్‌ ముద్ర ప్రతి గ్రామంలో స్పష్టంగా కనపడుతుంది. మరి, రాష్ట్రంలో  చంద్రబాబు మార్క్‌ ఎక్కడ ఉందో చూపించండి. 

అందరం ఏకతాటిపైకొచ్చి బాబు, పవన్‌లను చిత్తుగా ఓడిస్తాం:
చంద్రబాబు అధికార హయాంలో ప్రజల ఖాతాల్లో ఎందుకు ఒక్క రూపాయి కూడా జమచేయలేకపోయాడని అందరూ ఆలోచన చేయాలి. అదే ప్రభుత్వం.. అదే బడ్జెట్‌. మరి, మా ప్రభుత్వం పేదలకిచ్చిన సొమ్మంతా గత పాలకులు ఏం చేశారు..? అంటే, వాళ్లు దోచేసుకున్నారు.. పంచుకున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన సంక్షేమ లబ్ధిని లెక్కగట్టి.. చంద్రబాబు దవడ పగిలేటట్టు రేపటి ఎన్నికల్లో ఆయనకు అందరూ బుద్ధిచెప్పాలి. ఈ రోజు ఎక్కడ చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సోదరులంతా ఏకతాటిపైకొచ్చి చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లను చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయం.

ఇదీ చదవండి: టీడీపీ ప్లాన్‌.. కాంగ్రెస్‌ యాక్షన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement