జగన్‌ హత్యకు బాబు కుట్ర! | Chandrababu naidu Plan On YS Jagan Murder Attempt | Sakshi
Sakshi News home page

జగన్‌ హత్యకు బాబు కుట్ర!

Published Sun, Oct 28 2018 8:45 AM | Last Updated on Sun, Oct 28 2018 8:45 AM

Chandrababu naidu Plan On YS Jagan Murder Attempt - Sakshi

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ):  ప్రజలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చూపిస్తున్న ఆదరాభిమానాలు చూడలేకే ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కా ప్రణాళికతో హత్య చేయించేందుకు కుట్రపన్నారని వైఎస్‌ఆర్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ఆరోపించారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. చంద్రబాబు ఓ క్రిమినల్‌గా వ్యవహరిస్తున్నారని.. అటువంటి వ్యక్తి సీఎంగా ఉండడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమన్నారు. బాబు నరనరాల్లో ఉండేదంతా కుళ్లు, కుతంత్రం, క్రిమినల్‌ ఆలోచనలేనన్నారు. మేకతోలు కప్పుకున్న మృగంలా వ్యవహరించడం ఆయన నైజమని మండిపడ్డారు. బాబు డైరక్షన్‌లోనే అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఉన్నారన్నారు. ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న జగన్‌పై హత్యాయత్నం జరిగిన వెంటనే ముఖ్యమంత్రిగా ఇటువంటి చర్యలకు పాల్పడం దురదృష్టకరమని ఖండించాల్సిందిపోయి విలేకరుల సమావేశం పెట్టి జగన్‌పై కొంచెం కూడా మర్యాద లేకుండా పరుష పదజాలంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు.

ముందస్తుగానే ప్లాన్‌ చేయకుంటే దాడి జరిగిన గంటలో డీజీపీ ఠాకూర్‌తో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయించి హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి పబ్లిసిటీ కోసం.. పేపర్లలోకి ఎక్కాలని, జగన్‌ అభిమాని అని చిత్రీకరించే ప్రయత్నం చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. అలాగే 14 పేజీలతో కూడిన లేఖ ఒకటి రాయించి ప్రజలను తప్పుదోవ పట్టించేలా డీజీపీ వ్యవహరించడం తగదన్నారు. ఎన్నికల్లో గెలిచే దమ్ములేక అడ్డదారిలో మంత్రి పదవి పొందిన సోమిరెడ్డి చంద్రమోహన్, ఎంపీ కేశినేనిలకు.. జగన్‌ను హత్య చేయాలంటే చిన్న కత్తితో కాదని.. పక్కా ప్లాన్‌ ప్రకారం చేస్తామని అనడం ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు. సోంబేరి రెడ్డి నువ్వు అదే చేసినట్లయితే వైఎస్సార్‌ అభిమానులు నీకు కైమాకొడతారన్నారు. 

పక్కా ప్రణాళికతోనే..
చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన హర్షవర్థన్‌ చౌదరి గత కొన్నాళ్లుగా విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో క్యాంటిన్‌ నడుపుతున్నారని.. అక్కడ పనిచేస్తున్న శ్రీనివాస్‌ అనే యువకుడితో జగన్‌పై చంద్రబాబు హత్యాయత్నం చేయించారని తమ్మినేని ఆరోపించారు. వీఐపీ లాంజ్‌లో అయితే ఎటువంటి అనుమానం రాకపోవడంతోపాటు.. అక్కడైతే రాష్ట్ర పోలీసులు ఉండరని, ఆ నెపాన్ని కేంద్రంపై తోసేయవచ్చని పక్కా ప్రణాళికతో హత్యాయత్నానికి పూనుకున్నారన్నారు. ఏడాది కాలంగా జగన్‌ ఎప్పుడు వస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారన్న షెడ్యుల్‌ అంతా తెలుసుకుని పథకం ప్రకారమే అతన్ని హత్య చేయడానికి ప్రణాళిక రూపొందించారనే అనుమానం కలుగుతోందన్నారు. చంద్రబాబు నుంచి ప్రాణహాని ఉందని వంగవీటి మోహనరంగ రక్షణ కల్పించాలని కోరినప్పటికీ రక్షణ కల్పించలేదు సరికదా అందరికీ తెలిసేలా అంతమొందించిన ఘనత, ఎన్టీఆర్‌పై హత్యాయత్నానికి పాల్పడిన మల్లెల బాబ్జీలను చంపేసిన ఘనుడు చంద్రబాబేనన్నారు. 

 జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ కల్పించాలి 
జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై సమగ్ర విచారణ చేయించాలని సీతారాం డిమాండ్‌ చేశారు. దీని వెనుక ఉన్న పెద్ద హస్తాలెవరివి, భవిష్యత్‌లో ఇంకా ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడుతారు, చంద్రబాబుతో సహా ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయనే విషయాలపై సీబీఐతో గాని, సిట్టింగ్‌ జడ్జితో గాని, ప్రత్యేక ఉన్నత న్యాయస్థానంతో గాని, కేంద్రం నుంచి ప్రత్యేక కమిటీ వేయించి సమగ్ర విచారణ జరిపి హత్యాయత్నానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. స్వతంత్ర ప్రతిపత్తిగల ఏజెన్సీతో విచారణ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై, పోలీసులపై, అధికారులపై ప్రజలకు విశ్వాసం లేకుండా పోయిందన్నారు. జగన్‌పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించి జెడ్‌ ప్లస్‌ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలని కోరారు. 

చంద్రబాబుపై అలిపిరిలో దాడి జరిగినపుడు అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి వెంటనే సంఘటన స్ధలానికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారని, తిరుపతిలో మహాధర్నా నిర్వహించి చంద్రబాబుకి జెడ్‌ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలని అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారని తమ్మినేని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే చంద్రబాబుకి మాత్రం కనీస మానవత్వం లేదనడానికి జగన్‌పై దాడి జరిగిన అనంతరం ఆయన వ్యవహరించిన తీరే నిదర్శనమన్నారు.

విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పొన్నాడ వెంకటరమణ, యువజన విభాగం నాయకులు పేడాడ అశోక్, పార్టీ ఎచ్చెర్ల మండల కన్వీనర్‌ సనపల నారాయణరావు, పొందూరు మండల కన్వీనర్‌ బొనిగి రమణమూర్తి, మహిళా విభాగం నాయకురాలు టి.కామేశ్వరి ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement