విజయవాడలో జ్యోతి కన్వెన్షన్ నుంచి నిరసన ర్యాలీ చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు యలమంచిలి రవి తదితరులు
సాక్షి, నెట్‌వర్క్: విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నంలో గాయపడ్డ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఆకాంక్షించారు. తమ అభిమాన నేత వైఎస్ జగన్ ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ శుక్రవారం అన్ని జిల్లాల్లో సర్వమత ప్రార్థనలు జరిగాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. చర్చిలు, మసీదుల్లో ప్రత్యేక పార్థనలు నిర్వహించారు. కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. ఆలయాల వద్ద కొబ్బరి కాయలు కొట్టి మొక్కారు. జగన్ త్వరగా కోలుకోవాలని చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ఆలయాల్లో పూజలు చేశారు. తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు, సత్యవేడు, పీలేరు, పుంగనూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా నేతలు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు.
కువైట్‌లోని మసీదులో ప్రార్థనలు చేస్తున్న నెల్లూరు జిల్లా పొదలకూరుకు చెందిన ముస్లింలు
అనంతపురం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు. కదిరి, తాడిపత్రి, ధర్మవరం నియోజకవర్గాల్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అండతోనే వైఎస్ జగన్‌పై దాడి జరిగిందని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పార్టీ నేతలు పలు పూజా కార్యక్రమాలు, ప్రార్థనలు నిర్వహించారు. మంగళగిరి, ప్రత్తిపాడు, పొన్నూరు, సత్తెనపల్లి, తాడికొండ, వేమూరు, గుంటూరు నియోజకవర్గాల్లో ఆయా మండల పార్టీ నేతలు, స్థానిక నేతల ఆధ్వర్యంలో ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రతిపక్షనేతపై హత్యాయత్నం ఘటనను తప్పుదారిపట్టించేందుకు అధికార టీడీపీ కుట్రలు పన్నుతోందని, టీడీపీకి పోలీసుశాఖ తొత్తుగా వ్యవహరిస్తోందని తూర్పుగోదావరి జిల్లా నేతలు మండిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు జననేతకు బాసటగా నిలిచారు. జగన్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల్లోకి రావాలని కాంక్షిస్తూ మసీదులు, చర్చిలు, దేవాలయాల్లో అభిమానులు, కార్యకర్తలు ప్రార్థనలు, పూజలు చేశారు. ఘటనను తప్పుదారి పట్టించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నిందులు వేసేందుకు జరుగుతున్న కుట్రలను సహించేదిలేదంటూ పార్టీ నేతలు నినదించారు. జగన్‌కు పూర్తి అండగా ఉంటామని, ఆయా కార్యక్రమాల్లో పార్టీనాయకులు, కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు.
ప్రజల కోసం పనిచేసే నేత జగన్..
నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే వ్యక్తి వైఎస్ జగన్ అని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నేతలు పేర్కొన్నారు. వైఎస్ జగన్ కోలుకోవాలని జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్గాల్లో, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పొదలకూరు ప్రాంతం నుంచి కువైట్‌కు వలసవెళ్లినవారు అక్కడ సర్వమత ప్రార్థనలు చేశారు. వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా నేతలు, పార్టీ శ్రేణులు, ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిపక్ష నేతపై కత్తితో హత్యాయత్నం జరిగినా ప్రభుత్వం చిన్న సంఘటనగా చిత్రీకరించడంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడ్డాయి. శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం పలు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. అలాగే జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు. పలు ప్రాంతాల్లో మానవహారాలు నిర్వహించి దాడిపై నిరసన తెలియజేశారు. గుమ్మలక్ష్మీపురం, వేపాడ గ్రామాల్లో స్థానిక నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
జగన్‌పై హత్యాయత్నం వెనుక టీడీపీ సర్కార్ హస్తం ఉందని నేతలు ఆరోపించారు. విజయనగరం జిల్లాలో శుక్రవారం కూడా పలు చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జగన్ త్వరగా కోలుకోవాలని అన్ని మండలాల్లో ఆలయాల్లో పూజలు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు శుక్రవారం కర్నూలు జిల్లాలోని పలు దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాల్లో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ ప్రియతమ నేత జగన్ త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వైఎస్ జగన్ అభిమానులు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మార్కాపురంలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జగన్ కోసం మృత్యుంజయ హోమం నిర్వహించారు. పర్చూరులో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో క్రైస్తవులు, ముస్లింలు ప్రత్యేక పార్థనలు నిర్వహించారు. జగన్ కోలుకోవాలని పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు జరిగాయి.
అనంతపురం జిల్లా గుంతకల్లులో బంద్‌లో భాగంగా మోటార్ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి
యూఏఈలో పార్టీ శ్రేణుల నిరసనలు..
ప్రజల మనిషి వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరగడం అమానుషమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం యూఏఈ కన్వీనర్ నెల్లూరు రమేష్‌రెడ్డి అన్నారు. దాడికి నిరసనగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ షార్జాలో ఎన్‌ఆర్‌ఐ శ్రేణులు నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా రమేష్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలను రాజకీయంగానే ఎదుర్కోవాలేగానీ హత్యాయత్నాలు, దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ప్రతిపక్ష నేతపై దాడిని అందరూ ఖండిస్తుంటే.. సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు మాత్రం చౌకబారు విమర్శలు చేయడం సరైన పద్ధతికాదన్నారు. ఈ కార్యక్రమాల్లో యూఏఈ ఎన్‌ఆర్‌ఐ విభాగం పార్టీ నేతలు సోమిరెడ్డి, బ్రహ్మానంద్, రమణ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబూ.. ప్రజాక్షేత్రంలో ఎదుర్కో
కృష్ణా జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. పలు చోట్ల పార్టీ కార్యాలయాల్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. విజయవాడలో చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకుని గౌతంరెడ్డిని అరెస్టు చేశారు. గుడివాడ రూరల్ మండలం బిల్లపాడులో వైఎస్సార్‌సీపీ నేతలు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రజలందరి ఆదరణ చూరగొంటున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ని దమ్ముంటే ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవాలని వైఎస్సార్ సీపీ విజయవాడ నేతలు సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని హత్యా రాజకీయాలకు పాల్పడితే జగనన్న సైనికులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. జగన్ త్వరగా కోలుకోవాలని కోరుతూ శుక్రవారం సర్వమత ప్రార్థనలు చేశారు.
ఇకపై ఎయిర్‌పోర్టుల్లో వీఐపీలకు ప్రత్యేక భద్రత
దేశంలోని విమానాశ్రయాల్లో ప్రముఖ వ్యక్తుల (వీఐపీల)కు ఇకపై ప్రత్యేక భద్రత కల్పించాలని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) నిర్ణయించింది. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై గురువారం విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో హత్యాయత్నం జరగడంతో సీఐఎస్‌ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై విమానాశ్రయాల్లోని లాంజ్‌లు, వీఐపీ లాంజ్‌ల్లో ఉండే ప్రముఖుల చుట్టూ భద్రతా (సీఐఎస్‌ఎఫ్) సిబ్బంది రక్షణ వలయంలా ఉంటారు. వీఐపీలు బోర్డింగ్ పాయింట్‌కు వెళ్లేవరకూ వారు కొనసాగుతారు. అలాగే లాంజ్‌ల్లోని రెస్టారెంట్ల సిబ్బందిపై నిరంతర నిఘా ఉంచుతారు. వారు విధుల్లోకి ప్రవేశించే సమయంలో, ప్రముఖులకు అల్పాహారం, టీ వంటివి అందించే సమయంలో సునిశితంగా పరిశీలిస్తారు. ఇలాంటి ఘటన దేశంలో ఎక్కడా జరగలేదు. తొలిసారిగా విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్షనేత జగన్‌పై హత్యాయత్నం జరగడంతో సీఐఎస్‌ఎఫ్ సీరియస్‌గా తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment