ఢిల్లీలో చార్జ్‌షీట్ విడుదల చేస్తున్న వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలు, ఎంపీలు, మాజీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటనకు సంబంధించి దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని వైఎస్సార్ సీపీ సీనియర్ నేతలు పేర్కొన్నారు. ఈమేరకు ‘చార్జ్‌షీట్’ పేరుతో రూపొందించిన ప్రశ్నావళిని పార్టీ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బాలశౌరి మంగళవారం ఇక్కడి ఏపీ భవన్‌లో విలేకరుల సమావేశంలో విడుదల చేశారు.
ఇదొక భయంకరమైన కుట్ర..: ‘అక్టోబరు 25వతేదీన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఇదొక భయంకరమైన కుట్రగా, రాష్ట్రంలో ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వం యంత్రాంగం ఈ ఘటనను ఖండించకుండా, నిజాలను దాచిపెట్టి అసత్య ప్రచారాలు చేస్తూ దర్యాప్తు పూర్తవకుండానే ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఘటన తరువాత వైఎస్ జగన్ విశాఖ నుంచి విమానంలో హైదరాబాద్ వస్తుండగా మధ్యాహ్నం 2 గంటలకు డీజీపీ మీడియా సమావేశం నిర్వహించి నిందితుడు జగన్ అభిమాని అని ప్రకటించారు. అంతేకాకుండా నిందితుడు ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి అని ప్రస్తావించారు.’ అని వైఎస్సార్ సీపీ నేతలు పేర్కొన్నారు.
‘చార్జ్‌షీట్’లో పేర్కొన్నప్రశ్నావళి వివరాలు ఇవీ..
- జగన్‌పై హత్యాయత్నం జరిగిన గంటన్నర వ్యవధిలోనే డీజీపీ విశాఖపట్నంలో లేకున్నా నిందితుడి కులం, ఇతర కీలక వివరాలను ఎలా సేకరించారు?
- సరైన ఆధారాలు లేకున్నా నిందితుడు జగన్ అభిమాని అని డీజీపీ ఎలా చెప్పగలిగారు? డీజీపీ పేర్కొన్న అవాస్తవాలు విన్న తరువాత ఆ సమావేశం కేవలం అసత్యాలు ప్రచారం చేయడానికే నిర్వహించారని అర్థమవుతోంది. జగన్‌తో నిందితుడు శ్రీనివాసరావు ఉన్నట్లుగా సంక్రాంతి పండగ పోస్టరు ఫొటోను ఘటన జరిగిన గంటలోపే టీడీపీకి చెందిన మీడియా సంస్థలు విడుదల చేశాయి. ఆ పోస్టరుతో నిందితుడు.. జగన్ అభిమాని అనే ముద్ర వేయాలని చూశాయి.
- నిందితుడి ఫోటోను అధికారికంగా విడుదల చేయకముందే అతడి నేపథ్యం, ఏడాది కిందటి పోస్టరును టీడీపీ మీడియా సంస్థలు కేవలం ఘటన జరిగిన గంటలోపే ఎలా సేకరించాయి?
- సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఫోటోలో రోజా పువ్వు ఉంటే మొదట చూపించిన హెచ్‌డీ ఫోటోలో ఆ పువ్వు లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
- ఇతర పార్టీలకు చెందిన నాయకులు జరిగిన దాడిని ఖండిస్తూ, వైఎస్ జగన్‌ను పరామర్శిస్తే దాన్ని చంద్రబాబు కుట్రగా ఎలా అభివర్ణిస్తారు? మరి అదే కారణంతో తన మిత్రపక్ష పార్టీ కాంగ్రెస్‌కు చెందిన జానారెడ్డి, జైపాల్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చి వైఎస్ జగన్‌ను పరామర్శిస్తే కుట్రగా భావించలేదు ఎందుకని?
- ముఖ్యమంత్రి ప్రవర్తనాశైలి ఇలాగే ఉంటుందా? అలిపిరిలో చంద్రబాబుపై దాడి జరిగినప్పుడు అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చంద్రబాబుకు మద్దతుగా రోడ్డు మీదకు వచ్చి ధర్నా చేశారు.
- వైద్యులు గాయం 3 సెం.మీ. ఉందని, 9 కుట్లు అవసరమయ్యాయని చెబితే చంద్రబాబు మాత్రం గాయం కేవలం 0.5 సెం.మీ మాత్రమే ఏర్పడిందని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించాల్సిన అవసరం ఏమిటి? - తక్కువ భద్రత కలిగిన పాదయాత్రలోనే జగన్‌పై నిందితుడు హత్యాయత్నం చేసి ఉండవచ్చు కదా? మరి ఎయిర్‌పోర్టు లాంజ్‌లో ఎందుకు చేసినట్టు?
- టీడీపీ ఈ హత్యాయత్నాన్ని పథకం ప్రకారమే ఎయిర్‌పోర్టులో చేయించి ఆ నిందను కేంద్రం మీదకు నెట్టేయాలని ప్రయత్నించిందా?
- అదే రోజు రాత్రి 9.30 గంటలకు పోలీసులు 11 పేజీలతో కూడిన ఒక లేఖను విడుదల చేసి అది నిందితుడి జేబులో దొరికిందని పేర్కొన్నారు. అసలు ఒక్క మడత కూడా లేకుండా, చిరగకుండా ఒక వ్యక్తి 11 పేజీలను జేబులో ఎలా పెట్టుకుంటాడు? అసలు నిజాలను పక్కదోవ పట్టించేందుకే లేఖను మార్చారా? ఎందుకంటే ఒకటో పేజీ నుంచి 11వ పేజీ వరకు చేతిరాత వేర్వేరుగా ఉంది.
- నిందితుడు శ్రీనివాస్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని హత్య చేయడానికి ప్రయత్నించాడని రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలను తప్పదోవ పట్టించిన డీజీపీపై టీడీపీ ప్రభుత్వం తీసుకోబోయే చర్యలేమిటి? రెస్టారెంట్ యజమాని హర్షవర్దన్ చౌదరికి మంత్రులు నారా లోకేష్, గంటా శ్రీనివాస్‌లతో ఉన్న సంబంధాన్ని రిమాండ్ రిపోర్టులో ఎందుకు పేర్కొనలేదు?
- చంద్రబాబు నాయుడు, ఆయన కేబినెట్ సహచరులు ఈ ఘటన ఆపరేషన్ గరుడలో భాగమై ఉండొచ్చని ఆరోపించారు. మరి అలాంటప్పుడు ఒక సినీ నటుడికి పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ వద్ద కూడా లేని సమాచారం ఎలా వచ్చింది? పోలీసులు శివాజీని ఎందుకు విచారించడం లేదు? టీడీపీ ప్రభుత్వం ఇదొక కుట్రగా నమ్ముతున్నప్పుడు శివాజీని విచారించి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
- నిందితుడి కాల్ డేటా, టీడీపీ నేతలతో జరిపిన సంభాషణలతోపాటు నిందితుడి బ్యాంకు ఖాతాలో భారీగా డబ్బు ఉన్న విషయాన్ని పోలీసులు ఎందుకు దాచారు?
- హత్యాయత్నం వెనుక ఉన్న కుట్ర కోణాన్ని రిమాండ్ రిపోర్టులో ఎక్కడా ప్రస్తావించకపోగా, నిందితుడు శ్రీనివాస్ జగన్ అభిమాని అని రిపోర్టులో పేర్కొన్నారు. ఘటన వెనుక కుట్ర కోణంపై పోలీసులు ఎందుకు దర్యాప్తు చేయడం లేదు. కేసులోని విషయాలపై ముందుగానే ఒక నిర్ధారణకు వచ్చి ఆ తరువాత వాటిని నిరూపించడానికి దర్యాప్తు చేయడానికి గల కారణాలేంటి?
- నిందితుడిపై ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌లో నేర సంబంధిత కేసు ఉండగా అతడు ఎయిర్‌పోర్టులో పని చేసేందుకు వీలుగా ఎన్‌వోసీ ఎలా వచ్చింది?
Comments
Please login to add a commentAdd a comment