
చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: రఘువీరా
అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ను చంద్రబాబు ఓ పక్క నవ్యాంధ్రను చేస్తానని చెబుతూ మరోవైపు నేరాంధ్రప్రదేశ్గా మార్చుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాజధాని భూ సేకరణ విషయంలో చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రఘువీరారెడ్డి బుధవారం అనంతపురంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాప్తాడులో జరిగిన హత్యను చూస్తే ప్రభుత్వం ఈ హత్యలను దగ్గరుండి చేయిస్తున్నట్లుగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రతి పక్ష నేతలకు గన్మెన్లను తొలగించిన ప్రభుత్వం రాజకీయ హత్యలకు లైసెన్స్ ఇస్తుందన్నారు.
హత్య తదనంతరం జరిగిన పరిణామాలను గమనిస్తే దీని వెనక టీడీపీ భూ కబ్జాదారుల ప్రమేయం ఉండవచ్చునని అనుమానాన్ని రఘువీరా వ్యక్తం చేశారు. హత్య జరిగిన కార్యాలయంలో రికార్డులను తగులబెట్టడం వెనక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. రాప్తాడులో ఒక ఎకరం కోటి రూపాయల ధర పలుకుతున్న సమయంలో రికార్డులు తగులబెట్టి ఏదో మతలబు చేస్తున్నట్లు అర్ధమవుతోందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.