
‘దేశం’లో ... దొంగలు పడ్డారు
ఇంటి గుట్టును రట్టు చేసిన సొంతింటి వారి పుణ్యమాని టీడీపీ తమ్ముళ్లకు దిమ్మతిరిగి ‘మైండ్ బ్లాక్ ’ అయ్యింది. ‘ఓటుకు కోట్లు’ కేసుతో వారికిప్పుడు నక్షత్రాలు కనిపిస్తున్నాయి. ఇంత అడ్డంగా దొరికిపోవడానికి తమలో ‘విభీషణుడు’ ఎవరా అని తలలు బద్దలు కొట్టుకున్నారు. బలమే లేకుండా ఎలా గెలవాలో .. ఎవరిని కొంటున్నామో తమ అధినేత చంద్రబాబుకు సినిమా స్కోపులో చూపించిన వివరం కాస్తా ఎదుటి శిబిరానికి చేరిపోయింది.
సమయం కోసం కాచుక్కూర్చుని వల విసరడంతో పాతికేళ్ల ప్రాయం దగ్గర పడుతున్న పచ్చపార్టీకి రంగు పడింది. అత్యుత్సాహం చూపిన ఎమ్మెల్యే రేవంత్ ఏడు చువ్వల వెనక్కి వెళ్లారు. ఇంతకూ... ఈ లీకులు ఇచ్చింది ఎవరా అని ‘తవ్వకాలు’ జరిపిన ‘దేశం’ తమ్ముళ్లకు ఇంటి దొంగ ఎవరో తెలిసిపోయిందంటున్నారు. ఆధిపత్య పోరుతో ఏడాదిగా సతమతమవుతున్న వారు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా..
తమకు అడ్డులేకుండా చేసుకున్నారన్నది ‘దేశం’ శిబిరంలో చక్కర్లు కొడుతున్న కొత్త వార్త. అయితే, అధినేత పీఠానికే ఎసరు తెచ్చేలా వ్యవహరించిన ఆ నేతకు భవిష్యత్తుపై కొంత బెంగ ఉన్నా.. స్వపక్షంలోని ప్రత్యర్థి అడ్డుతొలగిందని, ఇక్కడ తాను తప్ప పార్టీకి దిక్కెవరని ధిక్కార స్వరం వినిపిస్తున్నాట్ట. ఏమీ లేని చోట ఆముదం మొక్కే మహా వృక్షం కాబట్టి .. భరించక తప్పుతుందా అని టీడీపీ నాయకత్వం సమాధాన పడుతోందట.