కౌన్సెలింగ్‌తో బదిలీలు!
* గెజిటెడ్ హోదా అధికారులకు మినహా అందరికీ వర్తింపు
* భార్యా భర్తలు ఉద్యోగులైతే ఒకే చోట పని చేసేలా ప్రాధాన్యం
* మినిస్టీరియల్ ఉద్యోగులు మూడేళ్లుగా ఒకే చోట పనిచేస్తుంటే బదిలీ
* ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు మినహాయింపు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో స్వల్ప మార్పులు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. గెజిటెడ్ అధికారి స్థాయి ఉద్యోగులు మినహా మిగతా వారిని(మినిస్టీరియల్ సిబ్బంది) కౌన్సెలింగ్ ద్వారానే బదిలీ చేయనున్నారు. గెజిటెడ్(ఎగ్జిక్యూటివ్ పంక్షనరీలు) అధికారి స్థాయి ఉద్యోగులను ఇష్టానుసారం బదిలీ చేయవచ్చని స్వయంగా ముఖ్యమంత్రే నిర్ణయం తీసుకోవడం పట్ల అధికార యంత్రాంగం విస్తుపోతోంది. ఏ ఉద్యోగినైనా కొన్ని నిబంధనల మేరకు బదిలీ చేస్తారు. ఎన్నికల్లో పార్టీకి అనుకూలంగా పనిచేయలేదనే నెపంతో ఇష్టం లేని గెజిటెడ్ ఉద్యోగులందరినీ ఇష్టారాజ్యంగా బదిలీ చేయాలనే నిర్ణయానికి రావటంపై ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
గెజిటెడ్ ఉద్యోగుల బదిలీలకు అధికారులు నిబంధనలు సూచించగా సీఎం మండిపడ్డారు. ‘నేను చెప్పినట్లు ఆదేశాలు ఇవ్వండి.. నేను చెబితే చేయరా...?’ అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గెజిటెడ్ ఉద్యోగులను ఎక్కడికైనా కౌన్సెలింగ్ లేకుండానే బదిలీ చేసేలా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఉద్యోగుల బదిలీల నిబంధనల్లో మార్పులను సూచించటంతో ఆమేరకు ఉత్తర్వులు జారీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. గెజిటెడ్ ఉద్యోగులు మినహా మిగతా వారిని(మినిస్టీరియల్ సిబ్బంది) కౌన్సెలింగ్ ద్వారానే బదిలీ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. తొలుత ఈ విధానాన్నిఉపాధ్యాయుల బదిలీలకే వర్తింప చేశారు. ఇప్పుడు మినిస్టీరియల్ ఉద్యోగులకు కూడా ఆ విధానాన్ని వర్తింప చేయనున్నారు. మూడేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులు బదిలీలు అర్హులు.ఒక కేడర్‌లో 20 శాతం మందికి మించి బదిలీ చేయరాదనే నిబంధనను ఇప్పుడు విధించనున్నారు. భార్య, భర్త ఉద్యోగులైతే ఇద్దరూ ఒకే చోట పనిచేసేందుకు వీలుగా బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు.