వైకుంఠాన్ని ఇక్కడే చూడొచ్చు: బాబు
తిరుమల: ఆధ్మాత్మిక నగరం తిరుమలకు మళ్లీ పూర్వ వైభవం తెస్తామని టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన గురువారం ఉదయం తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం క్యూ లైన్లను పరిశీలించి, భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతామని, జిల్లాను దేవాలయాల పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. వైకుంఠం అంటే చూడలేదని...కథల్లోను, పురాణాల్లో మాత్రమే విన్నామని... అలాంటిది తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో వైకుంఠం ఎలా ఉంటుందో అలాంటి ప్రశాంత, పవిత్ర వాతావరణం తిరుమలలో ఉంటుందని చంద్రబాబు అన్నారు. వెంకటేశ్వరుడి ఆశీస్సులతో భక్తుల నమ్మకాన్ని పెంచేలా పని చేస్తామని తెలిపారు.
స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణాను కూకటివేళ్లతో పెకలిస్తామన్నారు. స్మగ్లర్లు పోలీసులకు, ప్రభుత్వానికి సవాల్గా మారారని, ఒక్క స్మగ్లర్ను కూడా లేకుండా చేస్తామన్నారు. స్మగ్లర్లు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.