
జననేత జగన్‌మోహన్‌రెడ్డికి గిరిజనుల సమస్యలను వివరిస్తున్న రాష్ట్ర ఎస్టీ సంఘ ప్రతినిధులు
ప్రజాసంకల్పయాత్ర బృందం: రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది గిరిజనులున్నప్పటికీ చంద్రబాబు సర్కార్ తమకు కనీసం నామినేటెడ్ పోస్టు కూడా కేటాయించలేదని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు జింకల జయదేవ్ అన్నారు. ప్రజా సంకల్పయాత్ర చేపడుతున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం తోటపల్లి క్రాస్ వద్ద సోమవారం కలిసి గిరిజనుల సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మైదాన ప్రాంత గిరిజనులకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు.
వీరిని ఐటీడీఏ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఏడుగురు ఎమ్మెల్యేలున్నప్పటికీ గిరిజనులకు ఒరిగిందేమీ లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.బీటెక్, డిగ్రీలు చేసిన గిరిజన నిరుద్యోగులు ఖాళీగా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్‌ప్లాన్ నిధులు గిరిజనులకే ఖర్చు చేసే విధంగా చట్టం చేయాలని కోరారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ప్రతి జిల్లాలో గిరిజన భవనాలు నిర్మించడంతో పాటు స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని కోరుతూ జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. జననేతను కలిసిన వారిలో గిరిజన సంక్షేమ సేవా సంఘ అధ్యక్షులు పొన్నాల లక్ష్మణరావు, తదితరులున్నారు.