చంద్రబాబు అవకాశవాద రాజకీయాలనుఎండగట్టేందుకే పోటీ
- పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి
- నందిగామలో కాంగ్రెస్ ఎన్నికల కార్యాలయం ప్రారంభం
నందిగామ : సీఎం చంద్రబాబు అవకాశవాద రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే నందిగామ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని నిలిపినట్లు పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజలు ఓట్ల రూపంలో తెలియజేయడానికి, తద్వారా చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చూసేందుకే తాము పోటీలో ఉన్నట్లు వివరించారు. పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని సోమవారం రఘువీరారెడ్డి ప్రారంభించారు. కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం కూడా పాల్గొని అయ్యదేవర కాళేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం జరిగిన సభలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు కుటుంబానికి తాము ఎటువంటి నష్టం చేయలేదన్నారు. తంగిరాల కుటుంబానికి ఏదైనా నష్టం జరిగితే.. అది తెలుగుదేశం పార్టీ వల్లే అని పేర్కొన్నారు. ఎవరైనా ఎమ్మెల్యే మరణిస్తే ఉపఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండే సంస్కృతికి టీడీపీ తిలోదకాలు ఇచ్చిందని పేర్నొన్నారు. తంగిరాల కుటుంబంపై కాంగ్రెస్‌కు సానుభూతి ఉందని, చంద్రబాబుకే లేదని, అందువల్లే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ప్రభాకరరావుకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు.
తంగిరాల ప్రభాకరరావు కుమార్తెపై టీడీపీకి సానుభూతి ఉంటే ఆమెకు ఎమ్మెల్సీ పదవీ ఇచ్చి మంత్రిని చేయాలని డిమాండ్‌చేశారు. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తప్పించుకు తిరుగుతున్న ముఖ్యమంత్రి దివాలాకోరు తనాన్ని నియోజకవర్గ ప్రజలకు వివరిస్తామని చెప్పారు. రుణమాఫీ, డ్వాక్రా మహిళలు, ఎస్సీలకు బడ్జెట్‌లో నిధులను నామమాత్రంగానే కేటాయించారని విమర్శించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుడు ప్రచారం : జేడీ శీలం
కేంద్ర మాజీ మంత్రి జేడి శీలం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీని అపఖ్యాతిపాలు చేసేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని చెప్పారు.
విభజనకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీపై ఉందన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని కాంగ్రెస్ పార్టీ భావించిందని, త్వరలోనే బీజేపీ ఆ ప్రక్రియను చేపట్టే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో అమలుచేసిన పథకాల వల్ల పేదలకు ఎంతో మేలు కలిగిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ధరలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి బోడపాటి బాబురావు, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్(నెహ్రూ), మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డీసీసీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, ఆ పార్టీ విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్, నాయకులు వేల్పుల పరమేశ్వరరావు, పాలేటి సతీష్, జాఫర్, బొబ్బెళ్లపాటి శ్రీగోపాలకృష్ణసాయి, తలమాల డేవిడ్‌రాజు, కామ శ్రీను, రేపాల మోహనరావు, యండ్రపల్లి నారాయణరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.