రావద్దు బాబూ | Chandrababu Praja Garjana Postponed CHINTAMANENI Prabhakar Demand | Sakshi
Sakshi News home page

రావద్దు బాబూ

Published Thu, Jan 9 2014 4:34 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM

Chandrababu Praja Garjana Postponed CHINTAMANENI Prabhakar Demand

తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ :‘సంక్రాంతి పండగ అంటే ఆ హడావుడే వేరు. పండగకు మూడు రోజులు ముందు నుంచి ప్రారంభమయ్యే ఆ మజా నుంచి పండ గ తరువాత మూడు రోజులకు కూడా బయటకు రాలేం. కోడిపందాలు లాంటివి సాధార ణం కనుక చంద్రబాబు ప్రజాగర్జనను వాయిదావేయండి’ అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ డిమాండ్ చేశారు. టీడీపీ ప్రజాగర్జనపై చర్చించేందుకు పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశాన్ని స్థానిక జిల్లా రైస్ మిల్లర్స్ హాల్‌లో  బుధవారం నిర్వహించారు.  పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబుపై ప్రజలకున్న  విశ్వాసాన్ని పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని సూచించారు. కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బులిరామయ్య మాట్లాడుతూ పార్టీని జిల్లాలో నంబర్ వన్‌గా నిలపాలన్నారు. అధ్యక్షత వహించిన గూడెం నియోజకవర్గ ఇన్‌చార్జి ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ సర్వశక్తులు ఒడ్డి, అవసరమైతే ఆస్తులను కుదువపెట్టి జిల్లాలో 15 స్థానాలు టీడీపీ దక్కించుకునేలా కృషి చేస్తామన్నారు.
 
 గెలిచే సత్తా ఉన్నవారిని పక్కన పెడితే చూస్తూ ఊరుకోమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే హైకమాండ్‌పై పోరాటానికైనా సిద్ధమని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చలమలశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ కాపుల ఉన్నతికి పాటుపడింది టీడీపీ అని పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపికలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే సహించబోమని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. సంక్రాంతి సరదాలు, కోడిపందాల నేపథ్యంలో బాబు ప్రజాగర్జన తేదీని మార్చాలని  కోరారు. కష్టపడి పనిచేసిన వారిని విస్మరించి , కొత్తగా వచ్చే వారికి పార్టీలో ప్రాధాన్యత ఇస్తే సహించబోమని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ షరీఫ్ హెచ్చరించారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆస్తులు తగలేసుకున్నవారికి విలువ ఇవ్వకపోతే పార్టీకి మంచిది కాదన్నారు. క్రీడాస్ఫూర్తి ద్వారా యువతను పార్టీ వైపు ఆకర్షించాలని అల్లూరి విక్రమాదిత్య అన్నారు. పార్టీలోని కార్యకర్తలకు ఆవేశంకాదు, ఆలోచన కావాలని గుంటూరు జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు సాంబశివరావు హితవు పలికారు.
 
 పార్టీ జిల్లా పరిశీలకులు గరిక పాటి రామ్మోహన్‌రావు మాట్లాడుతూ టికెట్ల విషయంలో నాయకులు, కార్యకర్తల్లో అనుమానాలు, అపోహాలను గమనించామన్నారు. ఈ తరహా భయం కలగటానికి దారి తీసిన పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుంటామన్నారు. కొన్నిచోట్ల సామాజిక వర్గాలవారీగా సర్దుబాట్ల నేపథ్యంలో మార్పులు చేయాల్సి వస్తే, తప్పని సరిగా ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జిలు, కార్యకర్తల సమక్షంలో నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. ప్రజాగర్జన తేదీని ఖరారు చేయకుండానే సమావేశాన్ని ముగించారు. ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, టీవీ రామారావు,  మాజీ మంత్రులు మాగంటి బాబు, కారుపాటి వివేకానంద, జెడ్పీ మాజీ చైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు, మాజీ ఎమ్మెల్యే పీతల సుజాత, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు గంగిరెడ్ల మేఘలాదేవి, నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం, మేకా జానకిరామయ్య, పాలి ప్రసాద్  పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement