
చంద్రబాబు రాజీనామా చేయాలి
వైఎస్సార్ సీపీ నేతల డిమాండ్
సాక్షి, విజయవాడ : పవిత్ర గోదావరి నదిలో పుష్కర స్నానాలు చేయడానికి వచ్చిన 27 మంది పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో చనిపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కె.పార్ధసారథి డిమాండ్ చేశారు. మంగళవారం బందరు రోడ్డులోని తన కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుష్కరాలు తొలి రోజున ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని, మృతుల్లో మహిళలు, చిన్నపిల్లలే ఎక్కువ మంది ఉన్నారని అన్నారు.
ప్రభుత్వం ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చిందే తప్ప భక్తుల సంఖ్యను అంచనా వేసి సౌకర్యాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. బీజేపీ నాయకులు నాసిరకంగా పనులు జరిగాయని చెబితే ముఖ్యమంత్రే స్వయంగా పనులు పర్యవేక్షిస్తున్నారని మంత్రులు చెప్పారని, సీఎం నైతిక బాధ్యత వహించాలని పార్ధసారథి సూచిం చారు. ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ ఏడాది క్రితం నుంచే పుష్కర పనులను రూ.1460 కోట్లతో చేపట్టినట్లు చెప్పుకొచ్చిన చంద్రబాబు, ఇప్పుడు భక్తులు చనిపోవడానికి ఆయనే బాధ్యత వహించాలన్నారు. తహశీల్దార్‌పై దాడి ఘట నలో మహిళా తహశీల్దార్‌నే చంద్రబాబు తప్పుపట్టడంతో రెవెన్యూ ఉద్యోగులు కలత చెంది వారు పూర్తిస్థాయిలో పని చేయకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని ఆమె పేర్కొన్నారు.
జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్‌చార్జి సామినేని ఉదయభాను మాట్లాడుతూ పవిత్ర గోదావరిలో చంద్రబాబు కనీసం చెప్పులు, చొక్కా కూడా విప్పకుండా స్నానం చేశారని, బ్రాహ్మణులు వారిస్తున్నా చంద్రబాబు పట్టించుకోలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశా రు. ప్రతి మృతుడు కుటుంబానికి రూ.25 లక్షలు నష్టపరిహా రం చెల్లించడమే కాకుండా సీఎం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మాట్లాడుతూ టీడీపీ నేతలు, ముఖ్యమంత్రి స్నానంతో గోదావరి అపవిత్రమైందని, అక్కడ భక్తులు స్నానాలు చేసి ప్రాణాలు కోల్పోయారని అన్నారు. మృతుల ఫొటోలను నేతలు ప్రదర్శించారు. పార్టీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, కార్పొరేటర్ బొప్పన భవకుమార్, రాష్ట్ర కార్యదర్శి మొండితోక అరుణ్‌కుమార్, వైఎస్సార్ సీపీ నేతలు తుమ్మల చంద్రశేఖర్, కిలారు శ్రీనివాసరావు, అధికారప్రతినిధి టీవీకెఎస్ శాస్త్రి, మాజీ కార్పొరేటర్ జానారెడ్డి పాల్గొన్నారు.