ప్రజా ఉద్యమంగా ‘నీరు-చెట్టు’
సాక్షి, హైదరాబాద్: ‘‘ఐదేళ్లలో నీరు-చెట్టు కార్యక్రమం కింద రూ.27 వేల కోట్లను ఖర్చు చేసి చిన్ననీటి వనరులను పునరుద్ధరించడంతోపాటుగా జలసంరక్షణ పనులు చేపడతాం. తద్వారా భూగర్భ జలమట్టాన్ని పెంపొందిస్తాం. తద్వారా కరువు రహిత ప్రాంతంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. సమున్నత లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా చేపట్టాలి’’ అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
‘నీరు-చెట్టు’ కార్యక్రమంపై హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి 13 జిల్లాల కలెక్టర్లు, మండలాల తహశీల్దార్లు, వివిధ శాఖల అధికారులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు, ఐదు కార్యక్రమాలను చేపట్టామని.. ఆ ఐదు కార్యక్రమాల్లో ‘నీరు-చెట్టు’ అత్యంత ప్రధానమైనదని పేర్కొన్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో భూగర్భజలాలు అడుగంటిపోయాయని.. చిత్తూరుజిల్లాలో 1,500, కడపలో 800, అనంతపురంలో 550, కర్నూలులో 450 అడుగులకు భూగర్భజలమట్టం పడిపోయిందన్నారు.
ఈ దుస్థితిని నివారించడానికి, రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చడానికి ‘నీరు-చెట్టు’ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. దీనిని గురువారం చిత్తూరుజిల్లా తంబళ్లపల్లెలో తాను ప్రారంభిస్తానని.. అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో మంత్రులు, కలెక్టర్లు, అధికారులు శ్రీకారం చుట్టాలని ఆదేశించారు. ‘నీరు-చెట్టు’ కార్యక్రమం కింద చెక్‌డ్యాంలు, చెరువుల మరమ్మతు పనులతోపాటుగా పూడికతీత పనులు చేపట్టాలని సూచించారు. ఈ పనుల్లో యంత్రాలను ఉపయోగించుకోవచ్చునని, రైతుల పొలాలతోపాటూ రోడ్ల నిర్మాణానికి పూడికను ఉపయోగించుకోవచ్చని సూచించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
⇒ ‘నీరు-చెట్టు’ కార్యక్రమానికి నీటిపారుదలశాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. గ్రామీణాభివృద్ధి, అటవీ, వ్యవసాయ, రెవెన్యూశాఖలు భాగస్వాములుగా వ్యవహరిస్తాయి. జిల్లా స్థాయిలో కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. మండల స్థాయిలో జన్మభూమి-మా ఊరు నోడల్ ఆఫీసర్, గ్రామస్థాయిలో జన్మభూమి-మా ఊరు కమిటీలు దీనిని అమలుచేస్తాయి.
⇒ ఆయా నీటివనరులకు మరమ్మతులు చేశాక ఓసారి.. ఆ నీటివనరు వర్షపు నీటితో నిండిన తర్వాత మరోసారి ఫోటోలు తీసి క్లౌడ్‌సోర్సింగ్ ద్వారా గూగుల్ మ్యాప్‌లో పెట్టాలి. జలసంరక్షణ పనులు చేపట్టాక ఆ గ్రామంలో భూగర్భజలమట్టం ఏ స్థాయికి పెరిగిందన్న సమాచారమిస్తే.. దాన్ని సరిపోల్చుకుని సంబంధిత అధికారులకు గ్రేడింగ్ ఇస్తాం. ‘నీరు-చెట్టు’కు జలవనరులశాఖ, గ్రామీణాభివృద్ధిశాఖ తదిత ర శాఖల నుంచి నిధులు సమకూర్చుతాం.జిల్లాకు రూ.పది కోట్లు వంతున అదనంగా నిధులిస్తాం. దాతలు ముందుకొస్తే విరాళాలు సేకరించి.. వాటితో చేపట్టిన చెరువులు, చెక్‌డ్యాంలు వంటి వాటికి వారి పేర్లే పెట్టాలి.
కోటి ఎకరాలకు నీళ్లందుతున్నాయి
⇒ రాష్ట్రంలో 395 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఇందులో 200 లక్షల ఎకరాలే సాగుచేస్తున్నారు. కోటి ఎకరాలకు మాత్రమే నీళ్లందుతున్నాయి.నీరు-చెట్టు, సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయడం ద్వారా మరో కోటి ఎకరాలకు నీళ్లందిస్తాం. గోదావరి, కృష్ణా నదుల ద్వారా వృధా జలాలు వినియోగించుకున్నా కోటి ఎకరాలకు నీళ్లందించవచ్చు.
మీ ఊరి చెరువును మీరే బాగు చేసుకోండి
30 శాతం నిధులు మీరివ్వండి.. 70 శాతం మేమిస్తాం: అయ్యన్న
నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో చెరువుల్లో పూడికతీత పనులకు 30 శాతం నిధులను ఆయా గ్రామస్తులు సమకూర్చితే మిగతా 70 శాతం నిధులను రాష్ట్రప్రభుత్వం ఇస్తుందని పంచాయతీరాజ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. 30 శాతం నిధులివ్వడానికి ముందుకొచ్చే గ్రామాల్లోని చెరువుల్లో పూడిక తీతకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. నీరు-చెట్టు కార్యక్రమంపై సీఎం సమీక్ష అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చే ఐదేళ్లలో 28,933 చెరువుల్లో పూడికతీత కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు.
ఇందుకోసం రూ.27,110 కోట్లను ఖర్చు చేస్తామన్నారు. తద్వారా 48.68 లక్షల ఎకరాలను సాగులోకి తేవాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో భూగర్భజలాల సంరక్షణకు రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలాల నీటిమట్టాలపై అధ్యయనం చేయనున్నట్లు మంత్రి తెలిపారు.