మింగ మెతుకు లేదు..బాబు మీసాలకు సంపెంగ నూనె!
మింగ మెతుకు లేదు..బాబు మీసాలకు సంపెంగ నూనె!
Published Thu, Jul 17 2014 2:30 PM | Last Updated on Sat, Sep 2 2017 10:26 AM
మింగడానికి మెతుకు లేకపోయినా.. మీసాలకు సంపెంగ నూనె కావాలన్నారట వెనుకట ఎవరో.. కాని ప్రస్తుతం ఆ నానుడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సరిగ్గా అతికినట్టు సరిపోతుంది. ఓ పక్క డబ్బుల్లేవంటూ బీద అరుపులు అరుస్తూనే ఏ మాత్రం తగ్గకుండా దుబారా ఖర్చులకు సై అంటున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి లోటు బడ్జెట్ అని తెలిసిన విషయమే.
అయితే లోటు బడ్జెట్ అనే విషయాన్ని కనీసం పట్టించుకోకపోగా.. అట్టహాసంగా చేసిన ప్రమాణ స్వీకారానికి సర్కారు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేశారని అనేక ఆరోపణలు వచ్చాయి. కాని అవేమి పట్టించుకోకుండా.. సమయం చిక్కినపుడల్లా.. 'కూర్చోడానికి కుర్చీలేదు.. ఎక్కడ నుంచి పాలన సాగించాలి', 'ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉంది'', 'సమన్యాయం చేయకుండా రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చీ ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేశారు' అంటూ ఉపన్యాసాలతో ఊదర గొట్టేస్తూ చంద్రబాబు ముసలి కన్నీరు కారుస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పొదుపు పాటించాలని సందేశాలు ఇస్తూనే.. ముఖ్యమంత్రి హోదాలో పాటిస్తున్న పొదుపు తీరును చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.
హైదరాబాద్ తాత్కాలిక రాజధాని అని తెలిసినా.. సచివాలయంలో తన చాంబర్ ఆధునీకరణ కోసం 10 కోట్ల రూపాయలను నీళ్లలా ఖర్చు పెట్టేశారు. అంతేకాకుండా నారా చంద్రబాబు నాయుడు సొంతంగా ఓ టెలివిజన్ చానల్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు(ట). ప్రభుత్వంతో సంబంధం లేకుండా పార్టీపరంగా ఈ చానల్‌ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. చానెల్ ఆరంభించడంపై పార్టీ నేతలతో తీవ్రంగా చర్చిస్తున్నారు. ఇదే నిజమైతే... తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. ప్రజల్ని మభ్యపెట్టేందుకు 'ఎల్లో మీడియా'లో మరో అస్త్రం చేరడం ఖాయం.
Advertisement