చంద్రగిరి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో చంద్రగిరి మండలంలోని ఆమె అనుచరులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. దీంతో చంద్రగిరిలో అరుణకుమారి వర్గం ఖాళీ అయింది. ఆదివారం మండల కాంగ్రెస్ యువత పెద్ద సంఖ్యలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరనున్నారు.
దీంతో పూర్తిగా ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో మండలాన్ని శాసించిన హేమా హేమీలంతా వైఎస్‌ఆర్‌సీపీలో చేరడంతో పార్టీ నూతనోత్సాహంతో కదం తొక్కుతోంది. దాంతో తనకు టికెట్టు ఇస్తే కాంగ్రెస్ క్యాడర్ అంతా తన వెంటే వస్తుందని చెప్పుకుంటున్న గల్లాకు చుక్కెదురైంది. గల్లాను వ్యతిరేకిస్తున్న టీడీపీలోని ఒకరిద్దరు నాయకులు సైతం వైఎస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. చంద్రబాబు సొంత మండలమైన చంద్రగిరిలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభిమానులు ఎక్కువ.
అందుకే టీడీపీలోకి రావాలని గల్లా ఎంత ఒత్తిడి చేసినా ఫలితం లేకుండా పోయింది. గల్లా అరుణకుమారి టీడీపీలోకి వస్తే ఆమె అనుచరులతో పాటు కాంగ్రెస్ పార్టీ కేడర్‌అంతా తమ పార్టీలోకి వస్తుందని భావించిన చంద్రబాబుకు చుక్కెదురైంది. దీంతో ఖంగుతిన్న చంద్రబాబు కాంగ్రెస్ క్యాడర్‌ను వైఎస్‌ఆర్‌సీపీలోకి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ఈ ఎత్తుగడల్లో భాగం గానే గల్లాకే చంద్రగిరి టీడీపీ టికెట్టు అని తమ నాయకులతో అందరికి చెప్పించా రు. అయినా ఫలితం లేదు.