హాజరైన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
సాక్షి, చంద్రగిరి: ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మనం విధేయులం..మనమంతా కుటుంబ సభ్యులుగా మెలుగుదాం. కార్యకర్తల సంక్షేమం నా బాధ్యత.’ అంటూ ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం చిన్నగొట్టిగల్లు, ఎర్రవారిపాళెం మండలాల కార్యకర్తల ఆత్మీ య సమ్మేళన కార్యక్రమాన్ని ముక్కోటి సమీపంలోని నారాయణి కల్యాణ మండపంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, కళాశాల స్థాయిలోనే వైఎస్సార్ కుటుంబంతో తనకు అనుబంధం ఉందన్నారు. పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, వారి సంక్షేమం తన బాధ్యత అని హామీ ఇచ్చారు. తన సంపాదనలో 75శాతం ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేస్తానని, 25శాతం మాత్రమే తన కుటుంబానికి వెచ్చిస్తానని వెల్లడించారు. పార్టీలో కొనసాగే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందన్నారు. పార్టీకి విధేయతగా ఉండే కార్యకర్తలు పరస్పరం గౌరవించుకోవాలని సూచించారు. అప్పుడే పార్టీకి తగిన గుర్తింపు ఉంటుందని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. చదవండి: (గిరిజనుల హక్కులు కాలరాసిన చంద్రబాబు)
అన్ని మండలాల్లో ఎమ్మెల్యే కార్యాలయాలు
దేశంలో ఎక్కడా లేని విధంగా చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోందని ఆయన తెలిపారు. పార్టీ విధేయతకు, క్రమశిక్షణకు మనం స్ఫూర్తిదాయకంగా నిలవాలని చెవిరెడ్డి పిలుపునిచ్చారు. కరోనా కష్ట కాలంలో ప్రజలకు భరోసా కల్పించామని గుర్తు చేశారు. ఇంటింటికి మాస్కులు, శానిటైజర్లు, విటమిన్ సిరప్‌లు, టాబ్లెట్‌లు, పండ్లు, కూరగాయలు పంపిణీ చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకోవాల్సిన ఆవశ్యకత నెలకొందన్నారు. అన్ని మండలాల్లో ఎమ్మెల్యే కార్యాలయాలు 15 రోజుల్లో అందుబాటులోకి రానున్నాయని వివరించారు. ఎమ్మెల్యే కార్యాలయాల్లో ప్రతి కార్యకర్త అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. చదవండి: (‘ఉపాధి’లో వ్యవసాయానికే పెద్దపీట)
Comments
Please login to add a commentAdd a comment