ప్రత్యేక హోదా.. కలసి కదిలితే రాదా..
స్ఫూర్తి రగిల్చిన తమిళుల జల్లికట్టు పోరాటం
హోదా సాధనే లక్ష్యంగా నిరసనలకు శ్రీకారం
జలదీక్షతో శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
నేడు చంద్రగిరిలో భారీ ఎత్తున మానవహారం
తిరుపతిలో సీపీఐ భారీ ర్యాలీ
జిల్లాలో మళ్లీ ప్రత్యేక పోరు మొదలైంది. ప్రత్యేక హోదా కోసం పిడికిళ్లు బిగుసుకుంటున్నాయి. తమిళుల సంప్రదాయ క్రీడ జల్లికట్టు పోరాట స్ఫూర్తితో ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహ¯Œరెడ్డి ఇచ్చిన పిలుపును అందుకున్న జిల్లాలోని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, యువకులు, విద్యార్థులు ప్రత్యేక ఉద్యమానికి సమాయత్తమవుతున్నారు. పార్టీలకు అతీతంగా హోదా సాధనకు సంసిద్ధులవుతున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మంగళవారం భారీ ఎత్తున నిర్వహించిన జలదీక్ష కార్యక్రమం అన్ని వర్గాలనూ ఉద్యమ పథాన నడిచేందుకు కార్యోన్ముఖులను చేస్తోంది. వరుస ఉద్యమాలకు వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎంలు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయి.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తమిళ సోదరులు చేపట్టిన జల్లికట్టు పోరాటం జిల్లా యువతలో ఆలోచన రేకెత్తిం చింది. రాష్ట్రాభివృద్ధికి దోహదపడే ప్రత్యేక హోదా సాధన కోసం జల్లికట్టు తరహా పోరాటం ఎందుకు చేయకూడదన్న దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఉద్యమాన్ని చేపట్టాలని, దీన్ని బాధ్యతగా స్వీకరించాలని వైఎస్ జగన్ పిలుపునివ్వడంతో జి ల్లా అంతటా వేడి రగిలింది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ముందుగా ఉద్యమ తిలకం దిద్దుకున్నారు. తనతో పాటు పోరాట పథాన నడిచే కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం 10 గంటలకు చంద్రగిరి నియోజకవర్గంలోని రాయలచెరువులో పెద్ద ఎత్తున జలదీక్ష చేపట్టారు. తిరుపతితో పాటు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, కళాశాలల విద్యార్థులు, యువకులు జలదీక్షకు హాజరయ్యారు. ఉదయం 10.30 గంటలకు చెరువు సమీపంలో 5 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి 11.30 గంటలకు దీక్షను ప్రారంభించారు. భుజాల లోతున్న చెరువులో దిగి రెండు గంటల పాటు ప్రత్యేక హోదా కోసం నినాదాలిచ్చా రు. హోదా ఆవశ్యకతను వివరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదావస్తే కేంద్రం నుంచి 90 నిధులు గ్రాం ట్లుగా అందుతాయనీ, పరిశ్రమలకు పెద్ద ఎత్తున రాయితీలు లభిస్తాయని వివరించారు. హోదా లభిస్తే పరిశ్రమల స్థాపన కోసం విదేశీ పారిశ్రామిక వేత్తలను బతిమలాడాల్సిన అవసరమే ఉండదన్నారు.
నేడు చంద్రగిరిలో మానవహారం
ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరించడమే కాకుండా హోదా సాధన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న చంద్రబాబు సర్కారుపై నిరసన వ్యక్తం చేస్తూ బుధవారం చంద్రగిరిలో భారీ మానవహారం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరుగనుంది. ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సుమారు 2 వేల మందికి పైగా పాల్గొంటారని ఎమ్మెల్యే చెప్పారు.
నేడు నగరిలో నల్లరిబ్బన్లతో నిరసన
నగరి పట్టణంలో సాయంత్రం 5 గంటలకు ఎమ్మెల్యే ఆర్‌కె రోజా ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తారు.