చంద్రన్నా..ఇదేందన్నా..! | Chandranna Pelli Kanuka Scheme Delayed In YSR Kadapa | Sakshi
Sakshi News home page

చంద్రన్నా..ఇదేందన్నా..!

Published Fri, Aug 31 2018 1:27 PM | Last Updated on Fri, Aug 31 2018 1:27 PM

Chandranna Pelli Kanuka Scheme Delayed In YSR Kadapa - Sakshi

సాక్షి కడప: పేదల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పెళ్లి కానుక పేరుతో ఆదుకుంటున్నామని చెబుతున్న ప్రభుత్వ మాటలు ఆచరణలో అమలు కావడంలేదు. ప్రచార ఆర్భాటం తప్ప వాస్తవ పరిస్థితిలో మాత్రం భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2018 ఏప్రిల్‌ 20 నుంచి చంద్రన్న పెళ్లి కానుక పేరుతో టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక పథకానికి రూపకల్పన చేసినా పాలకుల నిర్లక్ష్యం..ప్రభుత్వం అశ్రద్ధతో ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. ఎన్నో ఆశలతో..పెళ్లి కానుకకు దరఖాస్తు చేసుకున్న వారికి నెలల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. చంద్రన్న పెళ్లి కానుక అందుకోవడానికి కూడా అనేక రకాల సమస్యలను అధిగమిస్తూనే ఫలితం కనిపించే అవకాశం ఉండగా.. అన్నీ దాటుకుని ముందుకు వచ్చినా ఇంతవరకు సొమ్ములు అందడం లేదు. నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సామాజిక వర్గాల వారీగా కానుకను నిర్ణయించి ప్రభుత్వం అందించాలని నిర్ణయించింది. అయితే పేదలు ఉన్నంతలో పెళ్లి చేసుకుని..తర్వాత కానుక కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాప్రభుత్వంలో కనికరం కరువైంది.

ఆరు నెలలుగా ఎదురుచూపులు
 2018 ఏప్రిల్‌ 20వ తేదీన చంద్రన్న పెళ్లికానుక పేరుతో ప్రభుత్వం కొత్త పథకానికి రూపకల్పన చేసింది. ఏప్రిల్‌ 20 తర్వాత పెళ్లిళ్లు చేసుకున్న అనేక మంది దీనికోసం దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో సుమారు 1,210 మంది దరఖాస్తు చేసుకున్నారు. వివాహాలు ముగిసి ఆరు నెలలు అవుతున్నా ఇంతవరకు కానుక అందలేదు.వివాహానికి ముందు 20 శాతం సొమ్ము ఇవ్వాల్సి ఉండగా  58 మందికి మాత్రమే అందించారు.1,210 మందిలో ఇప్పటివరకు కేవలం 30 మందికి మాత్రమే పూర్తి మొత్తం అందించగా, మరో 1,180 జంటలకు ఎదురుచూపులు తప్పడం లేదు.

సామాజిక వర్గాన్ని బట్టి కానుకల కేటాయింపు
 చంద్రన్న పెళ్లి కానుకలో సామాజిక వర్గాలకు అనుగుణంగా నిర్ణయించి మొత్తాలను ప్రకటించారు. గిరిజనులు, ముస్లిం మైనార్టీలకు పెళ్లి కానుక కింద రూ. 50 వేలు, ఎస్సీలకైతే రూ. 40 వేలు, బీసీలకు రూ. 35 వేలు, ఓసీలకు రూ. 20 వేలు చొప్పున నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలలో కులాంతర వివాహమైతే రూ. 75 వేలు, బీసీలలో కులాంతర వివాహానికి రూ. 50 వేలు అందించనున్నారు. ఇక వికలాంగులకు సంబంధించి పెళ్లి కానుక కింద రూ. లక్ష అందించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగానే అన్ని సామాజిక వర్గాలకు చెందిన అనేక మంది నూతన వధూవరులు చంద్రన్న పెళ్లి కానుకకు దరఖాస్తు చేసుకున్నారు.

దుల్హన్, గిరిపుత్రికకు మంగళం
రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ముస్లిం మైనార్టీలతోపాటు గిరిజనులకు సంబంధించి ఉన్న రెండు పథకాలకు ప్రభుత్వం మంగళం పాడింది. ముస్లిం మైనార్టీలు వివాహం చేసుకుంటే దుల్హన్‌ పథకం కింద రూ. 50వేలు అందించేవారు.గిరిజనులకు సంబంధించి ఎవరు పెళ్లి చేసుకున్నా సంక్షేమశాఖకు దరఖాస్తు చేసుకుంటే రూ. 50 వేలు అందించేవారు. అయితే దుల్హన్, గిరిపుత్రిక పథకాలకు మంగళం పాడి...చంద్రన్న పెళ్లి కానుకలోకే విలీనం చేశారు. దీంతో ప్రస్తుతం గిరిజనులతోపాటు ముస్లిం మైనార్టీలు కూడా ఆన్‌లైన్‌ ద్వారా చంద్రన్న పెళ్లి కానుక పథకం కిందనే దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కల్యాణ మిత్రలు క్షేత్ర పరిశీలన
పథకం అందడానికి నూతన వధూవరులకు అనేక రకాల సమస్యలు వెంటాడుతున్నాయి. బర్త్‌ సర్టిఫికెట్, తెల్లరేషన్‌కార్డు, కుల సర్టిఫికెట్, వివాహ రిజిస్ట్రేషన్‌ తదితర సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. వివాహానికి 15 రోజుల ముందే అధికారులకు తెలిపి ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకుంటేనే అవకాశం ఉంటుంది.లేకపోతే చంద్రన్న పెళ్లికానుక అందడం గగనం.పెళ్లి జరిగే రోజు స్థానికంగా ఎక్కడికక్కడ ఎంపిక చేసి కల్యాణ మిత్రలు వచ్చి పెళ్లి లైవ్‌ (జియో ట్యాగింగ్‌) ఫోటో అప్‌లోడ్‌ చేస్తేనే కానుక అందుతుంది. ఇలా అన్నిరకాల నిబంధనలు అధిగమించిన తర్వాత కూడా  కానుక సొమ్ము రాలేదు..  ఆరు నెలలు గడుస్తున్నా రాకపోవడంతో ఇంకా ఎన్ని రోజులు ఎదురుచూడాల్సి వస్తుందని వివాహం చేసుకున్న కొత్త జంటలు ప్రశ్నిస్తున్నాయి. వివాహమైన పదిహేనురోజులు, నెలకో, రెండు నెలలకైనా వేసినా బాగుంటుంది గానీ ఇలా నెలల తరబడి తిప్పుకోవడం ఏమిటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement