‘పది’లో సంస్కరణలు | changes in 10th class syllabus | Sakshi
Sakshi News home page

‘పది’లో సంస్కరణలు

Published Mon, Jun 2 2014 2:23 AM | Last Updated on Sat, Sep 15 2018 4:26 PM

changes in 10th class syllabus

 ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: పాఠశాల విద్యాశాఖలో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి 9, 10 తరగతి పరీక్షల్లో సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్ 2005, విద్యాహక్కుచట్టం 2009 లక్ష్యాలు సాధించేలా ఎన్‌సీఈఆర్‌టీ ప్రతిపాదించిన సంస్కరణలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈమేరకు విద్యాశాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు.
 
 పాఠశాలల్లో 9, 10 తరగతుల విద్యార్థులకు మూడు సమ్మెటివ్ పరీక్షలు నిర్వహిస్తారు. 9వ తరగతికి ప్రశ్నపత్రాలను డీఈసీబీ రూపొందిస్తుంది. పదో తరగతికి మొదటి రెండు సమ్మెటివ్  (త్రైమాసిక, అర్ధ సంవత్సర) పరీక్షలకు డీసీఈబీ ప్రశ్నపత్రాలు సరఫరా చేస్తుంది. పబ్లిక్ పరీక్షలకు మాత్రం ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్ కార్యాలయం నుంచి ప్రశ్నపత్రాలు జారీ చేస్తారు.
 
తాజా ఉత్తర్వుల ప్రకారం పదో తరగతి పరీక్షల్లో తెలుగు, ఇంగ్లిషు, హిందీ, ఉర్దూ సబ్జెక్టులకు ఒకే పేపర్ ఉంటుంది. జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, మేథమేటిక్స్ సబ్జెక్టులకు రెండేసి పేపర్లు ఉంటాయి.

సీబీఎస్‌ఈ పరీక్ష విధానం తరహాలో ఈ ఏడాది నుంచి పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల మార్కులతో పాటు ఇంటర్నల్ మార్కులు కూడా కలుపుతారు.

ప్రతి సబ్జెక్టుకు కేటాయించిన 100 మార్కుల్లో 80 మార్కులకు ఫైనల్ పరీక్ష నిర్వహిస్తారు. 20 మార్కులకు విద్యార్థుల అంతర్గత సామర్థ్యాలను అంచనావేసి కేటాయిస్తారు.
 
 35 మార్కులకు ఉత్తీర్ణత:
 ప్రతి సబ్జెక్టులో విద్యార్థులు కనీసం 35 మార్కులు సాధిస్తేనే ఆ సబ్జెక్టులు ఉత్తీర్ణులైనట్లు.  ఇప్పటి వరకు హిందీ మినహా మిగిలిన ఇంగ్లిషు, తెలుగు, గణితం, సైన్స్, సోషల్ సబ్జక్టులకు రెండేసి పేపర్లు ఉండేవి. ఈ రెండు పేపర్లలో కలిపి కనీసం 35 మార్కులు సాధిస్తే ఆ విద్యార్థి ఉత్తీర్ణుడైనట్లే. తాజా సంస్కరణల ప్రకారం విద్యార్థులు ప్రతి పేపర్‌లో కనీస ఉత్తీర్ణతా మార్కులు సాధించాలి. విద్యార్థులకు నిర్వహించే ఫైనల్ పరీక్షతోపాటు ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో కూడా కనీస మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థి కనీస ఉత్తీర్ణత 35  మార్కుల్లో28 మార్కులను ఫైనల్ పరీక్షల్లో సాధించాలి. మిగిలిన 7 మార్కులు ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో రావాలి.
 
విద్యార్థులకు పరీక్ష సమయాన్ని కూడా పెంచారు. తెలుగు, హిందీ, ఇంగ్లిషు పరీక్షలు రాసేందుకు 3 గంటల సమయం కేటాయించారు. గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ పరీక్షలకు ఒక్కో పేపర్‌కు రెండున్నర గంటలు సమయం ఇచ్చారు. అన్ని పరీక్షలకు అదనంగా ప్రశ్నపత్రం చదువుకునేందుకు మరో 15 నిముషాలు కేటాయించారు.
 
సమ్మెటివ్ అసెస్‌మెంట్ ఇలా..
9, 10 తరగతుల విద్యార్థులకు 20 మార్కులకు సమ్మెటివ్ అసెస్‌మెంట్ నిర్వహిస్తారు. ఈ 20 మార్కుల్లో 5 మార్కుల చొప్పున నాలుగు అంశాలను పరిశీలించి మార్కులు కేటాయిస్తారు. భాషా సబ్జెక్టుల్లో విద్యార్థులు కథల పుస్తకాలు, బాల సాిహ త్యం, వార్తా పత్రికలు చదవడం, వాటి గురించి తరగతి గదిలో చర్చించిన విషయాలకు 5 మార్కులు కేటాయిస్తారు.
 
సైన్స్‌లో తరగతి గదిలో ప్రయోగాలు నిర్వహించడం, రికార్డు రాసినందుకు, గణితంలో తరగతి గదిలో చేసిన లెక్కలు, సోషల్ స్టడీస్‌లో సామాజిక వర్తమాన అంశాలపై తరగతి గదిలో చర్చించినందుకు 5 మార్కులు కేటాయిస్తారు. విద్యార్థులందరికీ నోట్ బుక్స్‌లో రాతపనికి 5 మార్కులు, ప్రాజెక్టు వర్కుకు 5 మార్కులు, స్లిప్ టెస్ట్‌కు 5 మార్కులు చొప్పున మొత్తం 20 మార్కులకు విద్యార్థుల సామర్ధ్యాలను అంచనా వేసి కేటాయిస్తారు. జిల్లా విద్యాశాఖాధికారిచే నియమితులైన మోడరేషన్ కమిటీ ఈ రికార్డులన్నీ పరిశీలించి మార్కులు ఇస్తుంది. ఈ మార్కులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్‌కు ఆన్‌లైన్‌లో పంపుతారు.
 
 సహ పాఠ్యాంశాలకు ప్రాధాన్యం:
పాఠశాలలో మొదటిసారిగా సహ పాఠ్యాంశాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి వాటికి కేటాయించిన గ్రేడ్లను కూడా విద్యార్థుల మార్కుల జాబితాలో ప్రచురించనున్నారు. ఈ సహ పాఠ్యాంశాల్లో విద్యార్థులకు ఎటువంటి పరీక్షలు నిర్వహించనప్పటికీ వారి సామర్ధ్యాన్ని బట్టి విద్యార్థులకు ఏ+, ఏ, బీ, సీ, డీ గ్రేడ్లు ప్రకటిస్తారు. ప్రధానంగా విద్యార్థులకు వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ స్కిల్స్, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, ఆర్ట్స్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్‌లో విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలిస్తారు.  
 
 పదో తరగతిలో కొత్త పాఠాలు
గిద్దలూరు, న్యూస్‌లైన్: కాలానుగుణంగా విద్యా ప్రమాణాలు పెంచే క్రమంలో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి సిలబస్‌ను పూర్తిగా మార్చేశారు. సమాజంపై అవగాహన కల్పించే పాఠ్యాంశాలకు ప్రాధాన్యత కల్పించారు.  జాతీయ పాఠ్య ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో పాఠ్య పుస్తకాలను రాష్ట్ర విద్యా పరిశోధన మండలి మార్పు చేసింది. ముందుగా 2012-2013 విద్యా సంవత్సరంలో ఒకటి, రెండు, మూడు, ఆరు, ఏడు తరగతుల పాఠ్యపుస్తకాలను మార్చారు.

ఈ ఏడాదిలో పదో తరగతి పాఠ్య పుస్తకాల సిలబస్‌ను మార్చారు. దాదాపుగా 15 ఏళ్ల తర్వాత పదో తరగతి పాఠ్యపుస్తకాలు, పరీక్ష విధానంలో మార్పులు చేశారు. ఎన్నడూ లేని విధంగా ఈఏడాది ఏప్రిల్‌లోనే నూతన పాఠ్య పుస్తకాలను పాఠశాలలకు అందజేయడం శుభపరిణామం. మారిన సిలబస్‌లో కృత్యాధారిత బోధనకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. విషయ అవగాహనకు ప్రాధాన్యం ఇచ్చేవిగా ఉన్నాయి. విద్యార్థులు ఆలోచించడం, నేర్చుకున్న విషయాన్ని వ్యక్తీకరించడం, విశ్లేషణ చేసేలా, వ్యక్తిత్వాన్ని పెంచేలా పాఠ్యపుస్తకాలను రూపొందించారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు, స్త్రీల సాధికారత, వారిని గౌరవించడం తదితర విషయాలకు ప్రాధాన్యం ఇచ్చేలా పాఠ్యాంశాలు పొందుపరచారు.
 
 శిక్షణ ఇచ్చేదెన్నడు...?
 మరో 13 రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. మారిన సిలబస్‌కు అనుగుణంగా బోధన చేసేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. దీనిపై విద్యాశాఖ ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పాత సిలబస్ చెప్పడానికి అలవాటు పడిన తమకు నూతన సిలబస్‌లో బోధన మెళకువలు, నూతన పరీక్ష విధానంపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement