జగన్ రాకతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు!
జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ మంజూరు అయ్యిందన్న వార్త రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు నాంది కాబోతోంది. వివిధ రాజకీయ పార్టీల నేతలు జగన్ మోహన్ రెడ్డితో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని సంకేతాలు అందిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జగన్ మోహన్ రెడ్డి కృషి చేయాల్సిందిగా అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మధుసూదన్ గుప్తా విజ్ఞప్తి చేయడం విశేషం.
ఒకే ఒక్క వ్యక్తి రాజకీయ సమీకరణాలనే మార్చేయబోతున్నారా? ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పై విడుదల కానున్న తరుణంలో కాంగ్రెస్ నేతల నుండి వస్తోన్న స్పందన చూస్తే అదే నిజమనిపిస్తోంది. సీమాంధ్రను అట్టుడికిస్తోన్న సమైక్య సమరాన్ని జగన్ మోహన్ రెడ్డి ముందుండి నడిపించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, గుంతకల్ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా కోరుతున్నారు.
మధుసూదన్ గుప్తా ఒక్కరే కాదు వివిధ జిల్లాల కు చెందిన కాంగ్రెస్..టిడిపి నాయకులు జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పని చేయాలని ఆరాట పడుతున్నారు.తమకు అవకాశం ఇస్తే జగన్ మోహన్ రెడ్డితో కలిసి పని చేస్తామని వారు సంకేతాలు పంపుతున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మరింత వేగంగా అనూహ్యంగా మారడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. భావి రాజకీయ పరిణామాలన్నింటకీ జగన్ మోహన్ రెడ్డే కేంద్రబిందువుగా ఉంటారని వారు విశ్లేషిస్తున్నారు.