పెను మార్పులు అవసరం
గురుపూజోత్సవంలో విద్యా విధానంపై సీఎం చంద్రబాబు
పరిశీలన, సృజనతో కూడిన చదువులు కావాలి
రాష్ట్రాన్ని నాలెడ్జి సొసైటీగా మార్చాలి
ఏటా మండలానికో విద్యార్థికి సీఎం ఫెలోషిప్
టీచర్లందరికీ బోధనకు దోహదపడే ఐపాడ్స్
ఎయిడెడ్, వర్సిటీ టీచర్లకు ఉద్యోగ విరమణ వయసు త్వరలోనే 62కు పెంపు
సాక్షి, గుంటూరు/ విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో అమల్లో ఉన్న విద్యావిధానంలో పెనుమార్పులు అనివార్యమనీ, ప్రస్తుతం.. పరిశీలన, సృజనాత్మకత, సరికొత్త ఆలోచనలతో కూడిన చదువులు విద్యార్థులకు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇందులో భాగస్వాములు కావాలన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకుని దేశం డిజిటల్ ఇండియాగా మారేందుకు పరుగులు తీస్తున్న క్రమంలో రాష్ట్రాన్ని డిజిటల్ ఆంధ్రప్రదేశ్‌గా అభివృద్ధి పరిచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో చంద్రబాబు ఉపాధ్యాయులు, విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.
విద్యా సంస్థలన్నింటిలోనూ వినూత్న ఆలోచనలు, విస్తృత పరిశోధనలకు పెద్దపీట వేస్తూ బోధన జరగాలన్నారు. సంస్కారవంతమైన చదువులు విద్యార్థుల ఉజ్వల భవితకు దోహదపడతాయన్న విషయాన్ని గుర్తెరిగి ఉపాధ్యాయులందరూ బోధనా పరమైన అవకాశాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. సమగ్ర విద్యావిధానానికి చక్కగా దోహదపడే ఉపాధ్యాయులందరికీ బోధనకు ఉపయుక్తంగా ఉండే ఐపాడ్‌లను అందజేస్తామన్నారు. త్వరలో ఎయిడెడ్, యూనివర్సిటీ టీచర్ల ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ జీవో విడుదల చేయనున్నట్లు తెలిపారు.
177 మంది టీచర్లకు అవార్డులు
177 మంది ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన విద్యార్థినులు పూర్ణ, ఆనంద్‌లను సీఎం సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు. వారికి ల్యాప్‌టాప్‌లను బహూకరించారు. చదరంగంలో అత్యంత ప్రతిభ కనబర్చిన తెనాలికి చెందిన బి.మౌనిక అక్షయను సత్కరించారు. షార్ డెరైక్టర్ డాక్టర్ ఎన్.వి.ప్రసాద్, సాహితీవేత్త గరికపాటి నరసింహారావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యూరు. అధ్యాపకుల వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నట్టుగా సీఎం చేసిన ప్రకటనను పురస్కరించుకుని ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు చంద్రబాబును సత్కరించారు.