కదం తొక్కిన పాత్రికేయులు
ధర్నా, రాస్తారోకోలతో నిరసన
నెట్‌వర్‌క: సాక్షి చానెల్ ప్రసారాలను ప్రభుత్వం నిర్బంధంగా ఆపివేయించడంపై నిరసనోద్యమం కొన సాగుతోంది. పాత్రికేయులు, విద్యార్థి సంఘాల ఆధ్యర్యంలో మంగళవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిం చారు. సాక్షి టీవీ ప్రసారాలను కొనసాగించాలని డిమాండ్‌చేశారు. చిత్తూరులో స్థానిక ప్రెస్‌క్లబ్, విద్యార్థి సంఘాల నేతృత్వంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఆర్డీవో కోదండరామిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. పుత్తూరులో తహశీల్దార్ కార్యాలయ వద్ద జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. వారికి వైఎస్సార్‌సీపీ, బీజేపీ, సీపీఐ, ఏఐఎస్‌ఎఫ్, సీపీఎం తదితర రాజకీయ పార్టీల నాయకులు మద్దతు ప్రకటించారు. అనంతరం తహశీల్దార్ శ్రీనివాసులుకు వినతిపత్రం సమర్పించారు. కలికిరిలో వైఎస్సార్‌సీ పీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. పాలసముద్రంలో జర్నలిస్టులు నిరసన తెలిపారు. సాక్షి టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలని కోరుతూ తహశీల్దార్ మోహనవల్లికి వినతిపత్రం అందించారు.
మీడియా స్వేచ్ఛను హరించడం తగదు
ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను హరించడం సమాజానికి మంచిది కాదు. ప్రజాసంక్షేమాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం మీడియాను కట్టడి చేస్తే అన్ని వర్గాల నుంచి తిరుగుబాటు రావడం ఖాయం. వార్తలపై అభ్యంతరాలు ఉంటే ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసుకోవాలే కాని, ఏకంగా ప్రసారాలను కట్టడి చేయడం రాజ్యాంగం కల్పించిన భావప్రకటనను అణచివేయడమే. -రఘునాథరెడ్డి , సీనియర్ పాత్రికేయుడు
మీడియా గొంతు నొక్కాలనుకోవడం అవివేకం
ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్న మీడియా ఛానళ్ల ప్రసారాలను అడ్డుకోవడం ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు పరాకాష్ట. ఉద్దేశపూర్వకంగా మీడియా గొంతు నొక్కడం, అధికారం ఉంది కదా అని ఉద్యమాలను అణచి వేయాలనుకోవడం అవివేకం. -మహేష్, ఏఐఎస్‌ఎఫ్ డివిజన్ కార్యదర్శి, పుత్తూరు
అప్రజాస్వామ్యం..
సమాజ శ్రేయస్సు కోసం అహోరాత్రులు కష్టపడి పనిచేస్తున్న జర్నలిస్టులు, మీడియా సంస్థలపై దాడి చేయడం అప్రజాస్వామ్యం. సాక్షాత్తూ ప్రభుత్వంలోని పెద్దలే మీడియాపై దాడికి పురిగొల్పడం అన్యాయం. ఇలాగే కొనసాగితే జర్నలిస్టులు, ప్రజల తిరుగుబాటును రాష్ట్ర ప్రభుత్వం చవిచూడాల్సి ఉంటుంది. కెఎన్.హరిబాబు, బీజేపీ జిల్లా కార్యదర్శి, పుత్తూరు