
సిరివెన్నెలకు వేద ఆశీర్వచనం అందిస్తున్న పండితులు
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): వ్యక్తుల్లో ప్రతిభ కన్నా వ్యక్తిత్వం ముఖ్యమని వ్యక్తిత్వం ద్వారానే సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలిపారు. ఏలూరు నగర బ్రాహ్మణ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కేపీడీటీ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతికి మహోన్నత స్థానముందని, ప్రతీ వారిలో ఆధ్యాత్మిక చింతన ఉండాలన్నారు. ఏలూరుతో తనకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు.
తనను ఎంతగానో ఆదరించి అభిమానిస్తున్న ఏలూరు నగర ప్రజల ఆత్మీయతను ఎన్నటికీ మరిచిపోలేనని తెలిపారు. చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ అంబికా కృష్ణ మాట్లాడుతూ సినీ సాహిత్యాన్ని తారాస్థాయికి తీసుకువెళ్లిన ఘనత సీతారామశాస్త్రికే దక్కుతుందన్నారు. అనంతరం ఉగాది పంచాంగాన్ని అతిథులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఉగాది పురస్కారం అందించి దంపతులకు ఘన సన్మానం చేశారు. తొలుత మాచిరాజు వేణుగోపాల్, మాచిరాజు కిరణ్ కుమార్ పంచాంగ శ్రవణం చేశారు.
కార్యక్రమానికి టీవీ యాంకర్ చిత్రలేఖ, కేఎల్‌వీ నరసింహం వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అనంతరం బ్రాహ్మణ ఐక్య కార్యాచరణ సమితి మహిళ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు సిరివెన్నెల చేతుల మీదుగా బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, పారిశ్రామికవేత్త అంబికా రాజా, ఏలూరు నగర బ్రాహ్మణ ఐక్య కార్యాచరణ సమితి నాయకులు సత్యవాడ దుర్గాప్రసాద్, ఎంబీఎస్ శర్మ, కె.కృష్ణమాచార్యులు, ద్రోణంరాజు వెంకటరమణ, తోలేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment