చౌకదుకాణాల వ్యవహారంపై తమ్ముళ్ల యుద్ధం
ఎర్రగుంట్ల : చౌక దుకాణాల విషయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య బుధవారం ఘర్షణ జరిగింది. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. యుద్ధ వాతావరణం తలపించేలా సంఘటన జరిగింది. ఈ ఘర్షణలో ఐదుగురు గాయపడ్డారు. ఆ వివరాలివి. ప్రభుత్వ చౌక దుకాణాల కోసం ఎర్రగుంట్లలో టీడీపీలో ఆధిపత్య పోరు సాగుతోంది. అది ఒక్కసారిగా తారా స్థాయి చేరి, దాడులు చేసుకునే వరకు వెళ్లింది. వార్డు మాజీ సభ్యుడు, డీలర్ భాస్కర్ ధర పట్టికను తయారు చేసి డీలర్లుకు ఇస్తున్నారు.
ఈ విషయంపై మరో డీలర్ జంగంరెడ్డికి భాస్కర్ మధ్య వివాదం పెరిగింది. అంతేకాకుండా వలసపల్లె డీలర్ షిప్ విషయం కూడా ఈ ఘర్షణకు కారణమైంది. భాస్కర్, జంగంరెడ్డికి ఫోన్‌లో మాటల యుద్ధం జరిగినట్లు సమాచారం.తర్వాత పోట్లదుర్తి నుంచి భాస్కర్ నలుగురు స్నేహితులతో బైక్‌లలో ఎర్రగుంట్లకు వచ్చారు. ఎర్రగుంట్లలోని ప్రొద్దుటూరు బైపాస్‌రోడ్డు వద్ద బైక్‌లు ఆపి, ఫోన్ మాట్లాడుతుండగా, జంగంరెడ్డి తన అనుచరులతో సుమోలో వచ్చాడు.
వెంటనే రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. దీంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. భయపడిన స్థానికులు పరుగులు తీశారు. ఈ ఘర్షణలో భాస్కర్ తో పాటు స్నేహితులు హరిక్రిష్ణ, క్రిష్ణయ్య, గురుప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. అలాగే జంగంరెడ్డికి కూడా తలకు చేతికి, కాళ్లకు గాయాలయ్యాయి. వెంటనే భాస్కర్‌తో పాటు స్నేహితులను నేరుగా 108లో ప్రొద్దుటూరు ప్రభుత్వా స్పత్రికి తరలించారు. జంగంరెడ్డిని మాత్రం స్థానిక స్టేషన్‌కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తర్వాత ఎస్‌ఐలు నారాయణయాదవ్, లక్ష్మినారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి, గాయపడిన వారితో సమాచారం తెలుసుకున్నారు. రెండు వర్గాలు ఇచ్చిన పరస్పరం ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపారు. భాస్కర్ ఫిర్యాదు మేరకు ఆరుగురిపైన, జంగంరెడ్డి ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.