చౌక దుకాణాల ద్వారా ఉల్లి సరఫరా చేయాలి
కడప సెవెన్‌రోడ్స్ : ప్రభుత్వ చౌక దుకాణాల ద్వారా ప్రజలకు ఉల్లిపాయలు సరఫరా చేయాలని సీపీఎం నగర కార్యదర్శి ఎన్.రవిశంకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఉల్లిధరలు తగ్గించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నగర శాఖ గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బజారు ద్వారా ఉల్లి పంపిణీ చేస్తే నగరంలోని వినియోగదారులకు మాత్రమే అందుతాయన్నారు. మిగతా మున్సిపాలిటీలు, మండలాల్లోని ప్రజలకు అందుబాటులోకి రావన్నారు. కనీసం మండలానికి ఓ రైతు బజారును ఏర్పాటు చేస్తే ఉపయోగం ఉంటుందన్నారు.
ఉప్పు, పప్పు, మిరప, కంది, ఉల్లి వంటి నిత్యావసరాలను చౌక డిపోల ద్వారా అందించాలన్నారు. తాము అధికారంలోకి వస్తే నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని బీజేపీ, టీడీపీ ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేశాయని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినప్పటికీ ధరలను తగ్గించే చర్యలు చేపట్టలేదన్నారు. నిత్యావసరాలు భగ్గుమనడంతో పేద, మధ్య తరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు.
ప్రధాని మోడీ విదేశాల వెంబడి తిరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాజధాని నిర్మాణం తప్ప మరేమీ పట్టలేదని విమర్శించారు. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని కోరారు. రైతులు, వినియోగదారుల మధ్య దళారులను నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు సావంత్ సుధాకర్, పాపిరెడ్డి, సీఐటీయూ నాయకులు శంకర్, మనోహర్, లక్ష్మిదేవి, డీవైఎఫ్‌ఐ నాయకులు శంకర్, మగ్బూల్‌బాష తదితరులు పాల్గొన్నారు.