
750 సీట్లకు తనిఖీల గండం!
నవంబర్‌లో ఎంసీఐ అధికారుల రాక
ఇరు రాష్ట్రాల్లోని వైద్య కాలేజీల్లో వసతుల పరిశీలన
అదనంగా ఎంబీబీఎస్ సీట్లిచ్చినా సౌకర్యాల కల్పనలో ఉదాశీనత
అధ్యాపక సిబ్బంది నియమించకుంటే సీట్లు రద్దయ్యే అవకాశం
{పభుత్వానికి లేఖ రాసిన వైద్య విద్యాశాఖ
ఇప్పటివరకూ స్పందించని సర్కారు
హైదరాబాద్: ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఇటీవల కేటాయించిన అదనపు ఎంబీబీఎస్ సీట్లను కాపాడుకోవడం ఇరు రాష్ట్రాలకు ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) అధికారులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వైద్య కళాశాలల్లో తనిఖీల కోసం రానున్నారు. ఎలాంటి లోపాలున్నా సీట్లను రద్దు చేసేందుకు వెనుకాడరు. దీంతో రెండు రాష్ట్రాల అధికారుల్లో గుబులు మొదలైంది. రెండు రాష్ట్రాలకు కలిపి సుమారు 750 ఎంబీబీఎస్ సీట్లను అదనంగా కేటాయించారు. వీటిని మంజూరు చేసే సమయంలోనే ఎంసీఐ పలు నిబంధనలు విధించింది. తాము తనిఖీలకు వచ్చే నాటికి విధిగా వసతులు కల్పించాలని, అధ్యాపక సిబ్బంది కొరత లేకుండా చూడాలని స్పష్టం చేసింది. లేదంటే సీట్లను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇందుకు ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ఉన్నతాధికారులు అంగీకరించి రాతపూర్వకంగా హామీ ఇచ్చారు.
అధ్యాపకుల కొరతపై ఆందోళన
చాలా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ విద్యార్థులకు బోధించేందుకు అధ్యాపకులు లేరు. అనాటమీ, ఫిజియాలజీ తదితర సబ్జెక్టులు చెప్పే దిక్కు లేదు. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులు రెండు రాష్ట్రాల్లోనూ ఖాళీగా ఉన్నాయి. శ్రీకాకుళం, ఒంగోలు, ఆదిలాబాద్ రిమ్స్ కళాశాలల్లో అధ్యాపకుల కొరత భారీగా ఉంది. ఇప్పటివరకూ ఓ కళాశాలలో తనిఖీలు జరుగుతుంటే మరో కళాశాల నుంచి అధ్యాపకులను తెచ్చి చూపుతున్న సంఘటనలున్నాయి. వీరికి అప్పటికప్పుడు గుర్తింపు కార్డులు కొత్తగా సృష్టిస్తున్నారు.
దీనిపై ఎంసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై అలాంటివి కుదరదని కఠినంగా హెచ్చరించింది.
తెలంగాణలో ఒక్క పోస్టూ భర్తీ కాలేదు
ఆంధ్రప్రదేశ్‌లోని వైద్య కాలేజీల్లో 120 ప్రొఫెసర్ పోస్టులు, మరో వందకు పైగా అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం 245 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేశారు. మరో 300కు పైగా అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఒక్క పోస్టు కూడా భర్తీ జరగలేదు.
అనుమతించాలని అధికారుల మొర
భారతీయ వైద్య మండలి అధికారులు త్వరలో తనిఖీలకు వస్తున్న నేపథ్యంలో వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వైద్య విద్యాశాఖ అధికారులు నాలుగు రోజుల క్రితం లేఖ రాశారు. దీనికి సంబంధించి అనుమతిస్తే సుమారు 250 పోస్టులను భర్తీ చేస్తామని వివరించారు. సకాలంలో నియామకాలు చేయకుంటే అదనంగా కేటాయించిన ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయే ప్రమాదముందని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం అనుమతిస్తే వీలైనంత త్వరగా భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొన్నా ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకు లేదు. ఎంసీఐ తనిఖీల సమయం దగ్గరపడుతున్న కొద్దీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ నెల్లూరు, పద్మావతి కళాశాలలు కొత్తవి కాబట్టి ఉదారంగా వ్యవహరించి ఒక అవకాశం ఇచ్చినా, మిగతా పాత కళాశాలల్లో వసతులు కల్పించలేకపోతే సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. తనిఖీలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు భారతీయ వైద్యమండలి సభ్యుడు ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.