తిరుమల : తిరుమలలో శుక్రవారం వేకువజామున జంట చిరుతలు జట్టుగా సంచరించాయి. ఇప్పటి వరకు నాలుగు చిరుతలు వేర్వేరుగా సంచరిస్తూ భక్తులను, స్థానికులను హడలెత్తించాయి. ప్రస్తుతం అవి జట్లుగా విడిపోయి సంచరించటం ప్రారంభించాయి. శుక్రవారం వేకువ జాము 4 గంటలకు స్థానిక రింగ్‌రోడ్డు నుంచి బాలాజీనగర్ వరకు రెండు చిరుతల జంటగా సంచరించాయి. వాటినే స్థానిక బాలాజీనగర్ ప్రాంతంలో స్థానికులు చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ దృశ్యాలను అక్కడి స్థానికులు సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. కాలినడక మార్గాలతోపాటు తిరుమలలోనూ రోజూ చిరుతల సంచారం పెరిగింది. అయితే ఈ చిరుతల కట్టడి విషయంలో ఇటు టీటీడీ ఫారెస్ట్, అటు ప్రభుత్వ వైల్ట్‌లైఫ్ విభాగంలో ఏమాత్రం చలనం కనిపించటం లేదు.