⇒ మరొకరికి తీవ్రగాయాలు, పరిస్థితి విషమం
⇒ పేలుడు ధాటికి చెల్లాచెదురైన శరీర భాగాలు
⇒ బద్దలైన గోడలు.. తలుపులు, కిటికీలు
కరీంనగర్: కరీంనగర్ హౌసింగ్ బోర్డులోని ఓ ఇంట్లో శనివారం రాత్రి రసాయన పదార్థాలు పేలడంతో ఇద్దరు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా వెలుగోడు మండలానికి చెందిన పెంటెం నాగార్జున కుమార్(35), పెంటం శ్రీనివాస్ కుమార్(34), మల్ల రామ క్రిష్టరెడ్డి(42) హౌసింగ్‌బోర్డులోని ఎంఐజీ 2/336 ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వీరు వివిధ రసాయన పదార్థాలతో బొమ్మలు తయారు చేస్తూ నగరంలో సరయు మార్కెటింగ్ గిఫ్ట్ అర్టికల్స్‌ను నిర్వహించడంతో పాటు ఇతర దుకాణాలకు బొమ్మలను సరఫరా చేస్తున్నారు. వీరు వినియోగించే రసాయన పదార్థాల్లో కోబాల్డ్, హార్డినర్‌లకు పేలే స్వభావం ఉంది. శనివారం ఎప్పటిలాగే బొమ్మలు తయారు చేయగా.. మిగిలిన పదార్ధాలను ఇంటి సమీపంలో పారేశారు.
అక్కడ మధ్యాహ్నం సమయంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, త్రీ టౌన్ పోలీసులు వచ్చి పరిశీలించారు. ఇంట్లో పేలుడు పదార్థాలున్నాయనే అను మానంతో పలుచోట్ల తవ్వి చూశారు. సదరు వ్యక్తులను విచారించారు. వారి మాటలను పోలీసులు నమ్మకపోవడంతో వారి ముందు బొమ్మలు చేసి చూపించారు. దీంతో పోలీసులు వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా, ఇంట్లో పది లీటర్ల క్యాన్‌లో ఉన్న హార్డినర్ ఎక్స్‌పెయిరీ డేట్ ముగిసిందని ఆదివారం రాత్రి గమనించిన శ్రీనివాస్, నాగార్జునలు సంబంధిత కంపెనీకి ఫోన్ చేసి చెప్పారు. అది పేలుడు స్వభావం కలదని, దానిని నీటిలో కలిపి దూరంగా పారబోయాలని కంపెనీ ప్రతినిధి తెలిపినట్టు సమాచారం. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో శ్రీనివాస్ సదరు పౌడర్‌లో నీళ్లు కలిపేందుకు ప్రయత్నించగా, సరిగా కలవలేదు.
దీంతో క్యాన్‌లో చేయిపెట్టి గట్టిగా నొక్కడంతో అది పెద్ద శబ్ధంతో పేలి మంటలు లేచాయి. అవి పక్కనే ఉన్న రసాయనాలకూ అంటు కున్నాయి. గది తలుపులు, కిటికీలు మూసి ఉంచడంతో పేలుడు తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ ప్రమాదంలో పెంటం నాగార్జునకుమార్, మల్లు రామకృష్ణారెడ్డి అక్కడిక్కడే మృతిచెందారు. రసాయనం కలిపిన శ్రీనివాస్ చేతులు తెగిపోయాయి. కాళ్లు ఇతర భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఇద్దరి శరీరాలు మాంసం ముద్దలుగా మారాయి. పేలుడు ధాటికి గదిలోని కిటికీలు, తలుపులు దూరంగా ఎగిరిపడగా ఒక పక్క గోడ పూర్తిగా బద్దలైంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేవారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ కుమార్‌ను హైదారాబాద్‌కు తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ శివకుమార్, కరీంనగర్ డీఎస్పీ రామారావు పరిశీలించారు.
రసాయనాలు పేలి ఇద్దరి దుర్మరణం
Published Mon, Dec 1 2014 3:15 AM | Last Updated on Sat, Aug 25 2018 5:41 PM
Advertisement
Advertisement