వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి కారుమూరి విమర్శ
తణుకు : రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విస్మరించి మోసం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు విమర్శించారు. ఆయన ప్రణబ్ కమిటీకి చంద్రబాబు లేఖ ఇచ్చి తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించారని పేర్కొన్నారు. విభజన చట్టంలో ఉన్న హామీల మేరుకు ప్రత్యేక హోదా కల్పించాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. విదేశీ పర్యటనల ద్వారా రాష్ట్రానికి పరిశ్రమలు రావని, ప్రత్యేక హోదాతోనే పూర్తి స్థాయిలో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు.
ప్రజల అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తూ వారిని మోసం చేస్తున్న చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. పట్టిసీమ పథకం పూర్తి కాకుండా జాతికి అంకితం చేసిన చంద్రబాబు రైతులను మోసగిచారని పేర్కొన్నారు. కనీసం కాలువలు కూడా పూర్తి కాకుండానే ఆయన హడావుడి చేస్తుడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టుపై చూపిస్తున్న శ్రద్ధను పోలవరం ప్రాజెక్టుపై ఎందుకు చూపడం లేదో ప్రజలకు అర్థమవుతోందన్నారు. కేవలం కమీషన్ల కోసమే పట్టిసీమ, రాజధాని నిర్మాణాల చుట్టూ చంద్రబాబు ప్రదక్షిణలు చేస్తున్నారని కారుమూరి విమర్శించారు.