వాగ్దానం ‘మాఫీ’ | Chief Minister chandrababu Naidu loan waiver chatting | Sakshi
Sakshi News home page

వాగ్దానం ‘మాఫీ’

Published Fri, Jan 23 2015 5:00 AM | Last Updated on Mon, Oct 1 2018 1:21 PM

Chief Minister chandrababu Naidu loan waiver chatting

సాక్షి ప్రతినిధి, ఏలూరు :అధికారంలోకి రావాలి. ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని అవిచ్ఛిన్నంగా ఏలాలి. రైతులు ఏమైపోతే ఏం. అందుకే.. అంకెల గారడీ చేశారు. రుణమాఫీ వాగ్దానంతో అందలమెక్కారు. మాఫీ చేసింది రుణాల్ని కాదని.. వాగ్దానాన్ని మాత్రమేనని తెలుసుకునేలోగా చంద్రబాబు మాయాజాలంలో పడిన పశ్చిమ రైతులు దారుణంగా మోసపోయారు. జిల్లాలో మాఫీ కావలసిన రుణాలు సరిగ్గా రూ.5,200 కోట్లు. 2013-14 నాటికి జిల్లాలో ఇచ్చిన వ్యవసాయ రుణాల మొత్తం అది. వాస్తవానికి చంద్రబాబు హామీ మేరకు రూ.5 వేల కోట్ల పైచిలుకు మాఫీ కావాలి. కానీ.. రాష్ర్టంలోని 13 జిల్లాల రైతుల రుణమాఫీకి కేటాయించింది రూ.5 వేల కోట్లే. పశ్చిమగోదావరి జిల్లాకు కేటాయించింది రూ.369 కోట్లు మాత్రమే. అంటే మిగిలిన రూ.4,831 కోట్ల రుణాలను రైతులే చెల్లించుకోవాలి. కేటాయించిన రూ.369 కోట్లయినా రైతుల ఖాతాల్లో జమ అయి పూర్తిగా రుణ విముక్తి కలిగిందా అంటే.. అవునని ఒక్క రైతు కూడా చెప్పలేకపోతున్నాడు.
 
 తేలని రూ.50 వేలలోపు రుణాల లెక్క
 ఒకేసారి మాఫీ అవుతాయని, రూ.లక్షన్నర వరకు ఉన్న రుణాల్లో తొలివిడతగా 20శాతం మాఫీ అవుతుందని ప్రభుత్వం నెలన్నర కిందట ప్రకటించింది. జిల్లాలోని మొత్తం 8.50 లక్షల రైతుల్లో తొలి విడత 3.50 లక్షల మంది మాత్రమే రుణమాఫీకి అర్హులని తేల్చింది. గత డిసెంబర్ 10వ తేదీ నుంచి మాఫీ ప్రక్రియ మొదలుపెట్టి వారంలోగా ముగిస్తామని సర్కారు ప్రకటించింది. నేటికీ తొలివిడత రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాలేదు. ఇప్పటికీ జిల్లాలో ఏ ఒక్క రైతు రుణ మాఫీకి సంబంధించి తన ఖాతాలో పూర్తిగా సొమ్ము జమ అయిందని చెప్పే పరిస్థితి లేదు. ఇక రూ.50 వేల లోపు రుణాలు ఎన్ని ఉన్నాయో అధికారులే చెప్పలేని స్థితి. జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి ఎన్.లక్ష్మీనారాయణ సైతం తన వద్ద సరైన సమాచారం లేదంటూ చేతులెత్తేస్తున్నారంటే రుణమాఫీ ప్రక్రియ జిల్లాలో ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
 
 5 లక్షల ఖాతాల మాటేమిటి
 తొలి విడతకే ఇంత అయోమయ పరిస్థితి నెలకొంటే.. జిల్లాలో రెండో విడతగా రుణమాఫీ కావాల్సిన రైతుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. మలి విడతలో 5 లక్షల రైతుల ఖాతాలను పరిశీలించి పంపాలని తహసిల్దార్లను  ప్రభుత్వం ఆదేశిం చింది. ఆధార్, రేషన్ కార్డుల వివరాలతో ముడిపెడుతూ 33 అంశాలతో ఉన్నా ఫారం నింపాలన్న నిబంధనతో చాలామంది రైతులు సకాలంలో వివరాలు ఇవ్వలేకపోయారు. ఈ సాకుతో జిల్లాలోని 96 వేల మంది ఖాతాలకు ప్రభుత్వం కోత పెట్టింది. మిగి లిన 4 లక్షల 4వేలమంది రైతుల ఖాతాలను పెండింగ్ లిస్ట్‌లో పెట్టి మళ్లీ ఆయా ఖాతాలకు పత్రాలను సమర్పించాలని సూచించింది. దరఖాస్తులు సమర్పించేందుకు ఈనెల 24 వరకు గడువిచ్చింది. ఇప్పటికే పలుమార్లు పత్రాలు సమర్పించినా.. ఎప్పటికప్పుడు కొర్రీలు పెడుతూ పదేపదే దరఖాస్తులు కోరడంపై  రైతులు ఆందోళన చెందుతున్నారు.

 మరో పక్క అధికారులు సర్కారు నిబంధనలు అమలు చేయలేక, రైతులకు సమాధానం చెప్పలేక నలిగిపోతున్నారు. రుణమాఫీ ప్రక్రియకు సంబంధించి వ్యవసాయ శాఖ వద్ద కూడా ఇప్పటికీ సరైన సమాచారం లేదు. ప్రభుత్వమే రుణమాఫీ ప్రక్రియను గందరగోళపరిచి రైతులతోపాటు అధికార యంత్రాంగాన్నీ ఇబ్బంది పెట్టే కుట్రకు తెర లేపిందని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో ఈనెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో చేపట్టనున్న రైతు దీక్షకు పోటెత్తేందుకు పశ్చిమ రైతులు సన్నాహాలు చేసుకుంటున్నారు. అన్నదాతను ముంచిన ప్రభుత్వంపై వైఎస్ జగన్ నేతృత్వంలో రాజీలేని పోరాటాలకు పశ్చిమగోదావరి జిల్లా నుంచే శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు.
 
 ఇంత దారుణంగా వంచిస్తారా
 ఎన్నో హామీలతో అరచేతిలో స్వర్గం చూపించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. హామీల అమలు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి మోసపూరితంగా ఉంది. ఆయన అధికారంలోకి వస్తే ఏదో జరుగుతుందని ఆశించిన రైతు ఈ రోజు నిలువునా దగాపడి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామన్నారు. దీంతో కష్టాల్లో ఉన్న రైతులు టీడీపీకి అధికారం కట్టబెట్టారు. తీరా రుణమాఫీ అమలుకు వచ్చేసరికిగాని తాము మోసపోయామనే విషయం వారికి తెలియలేదు. రుణమాఫీ విషయంలో బ్యాంకర్లకు, రెవెన్యూ అధికారులకు స్పష్టత లేదు. ప్రభుత్వ పథకం అమలులో అధికారులు సైతం ఇంత గందరగోళం ఎదుర్కొన్న పరిస్థితి నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదు. రూ.50 వేలలోపు రుణం పూర్తిగా మాఫీ అన్నారు. మిగిలిన రుణాలు ఐదేళ్లలో మాఫీ అంటున్నారు. మరోవైపు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అమలు అంటున్నారు.
 
 మొత్తంగా గందరగోళం సృష్టిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే తాకట్టులో ఉన్న బంగారు ఆభరణాలన్నీ వెంటనే ఒంటిపైకి వచ్చేస్తాయని రంగుల ప్రపంచాన్ని చూపించారు. డ్వాక్రా మహిళలనైతే నిలువునా మోసం చేశారు. మొన్నటి వరకూ బ్యాంకు అధికారులు డ్వాక్రా మహిళల ఇళ్లకు వెళ్లి రుణాలు ఇచ్చేవారు. ఇప్పుడి మహిళలు రుణాలు కోసం వెళుతుంటే బ్యాంకు తలుపులు వేసేస్తున్నారు. వాగ్దానాల అమలులో మోసపూరిత విధానాల వల్లే ఇదంతా జరుగుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో తణుకులో రైతు దీక్ష చేపడుతున్నారు. వైఎస్ జగన్ తనకోసమో.. పార్టీ కోసమో ఈ పోరాటం చేయడం లేదు. ఒకటి గమనించాలి. ఇప్పట్లో ఎన్నికలు లేవు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాల్సిన అవసరం.. ఆదుర్దా కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేవు. రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు పడుతున్న బాధలు, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బాధ్యతగల ప్రతిపక్ష నాయకుడిగా హామీల అమలుకు సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్ జగన్ ఈ దీక్ష చేపడుతున్నారు.
 - కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement