
చంద్రన్నా.. సమస్యలు చూడన్నా..
నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తాం.. హాస్పిటల్ స్థాయిని 50 పడకలకు పెంచుతాం.. ఆర్టీసీ డిపోను వెంటనే పునరుద్ధరిస్తాం.. తాడేపల్లిగూడెం గేటు వద్ద ఆర్వోబీ నిర్మిస్తాం.. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం.. ఇవి ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబునాయుడు, టీడీపీ నాయకులు గుప్పించిన హామీలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక గణేష్ చౌక్ సెంటర్‌లో జరిగిన సభలో చంద్రబాబు హామీల వర్షం కురిపించారు. తెలుగుదేశం ప్రభుత్వం గద్దెనెక్కి ఏడు నెలలు గడుస్తున్నా ఈ హామీలలో ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. నియోజకవర్గంలో సమస్యలు తాండవిస్తున్నా.. అధికార పార్టీ నాయకులు ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సీఎం చంద్రబాబు ఆదివారం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా సమస్యలపై ఫోకస్.
- నిడదవోలు
గేటు పడిందా గోవిందా
నిడదవోలు నెహ్రూబొమ్మ సెంటర్‌లో రైల్వే గేటు వద్ద ఆర్వోబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి) నిర్మాణం ఎండమావిగానే మిగిలిపోయింది. గతంలో ఆర్వోబీ మంజూరైందని ఎంపీ మాగంటి మురళీమోహన్ ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. ఉభయగోదావరి జిల్లాలకు రాకపోకలకు నిడదవోలు దగ్గరదారి కావడంతో రోజూ వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు వైపు వెళ్లేందుకు కచ్చితంగా గేటు దాటాల్సిన పరిస్థితి. రోజుకి సుమారు 200 ైరెళ్లు నిడదవోలు మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో 200 సార్లు గేటు పడుతుంది. ఆ సమయంలో ట్రాఫిక్ రద్దీగా మారుతోంది. ఒక్కోసారి రైల్వేగేటును వాహనాలు ఢీకొనడంతో రైల్వే సిగ్నల్ వ్యవస్థ దెబ్బతింటోంది. ఇటువంటి సందర్భాలలో గంటల తరబడి గేటు మూతపడటంతో ట్రాఫిక్ నిలిచిపోతుంది.
పేరుకే పెద్దాసుపత్రి
నిడదవోలులో ప్రభుత్వాసుపత్రి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా కొనసాగుతోంది. పట్టణంలోని 45 వేల జనాభాతో పాటు చుట్టుపక్కల 45 గ్రామాలకు సేవలందించాల్సిన ఆసుపత్రిలో 8 పడకలు మాత్రమే ఉన్నాయి. ఆసుపత్రి స్థాయిని 50 పడకలకు పెంచాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉన్నా ప్రతిపాదనలకే పరిమితమవుతోంది. కనీసం 30 పడకల స్థాయికి పెంచేందుకు కూడా నాయకులు ప్రయత్నించకపోవడం గమనార్హం. ఆసుపత్రిలో అరకొర సేవలతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర కేసులను వైద్యులు తణుకు, రాజమండ్రి ఏరియా ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఎక్స్‌రే యంత్రం, ఆక్సిజన్ సిలిండర్, మత్తు మందు అందించే యంత్రాలు లేవు. రోగులకు రెండు గదులు మాత్రమే కేటాయించడంతో అవస్థలు తప్పడం లేదు. రోజూ కనీసం 160 మంది రోగులు ఆసుపత్రికి వస్తున్నా మందులు పూర్తిస్థాయిలో లేవు. ప్రభుత్వాసుపత్రితో పాటు నియోజకవర్గంలోని మూడు పీహెచ్‌సీల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. గర్భిణులకు సదుపాయాలు లేకపోవడంతో ప్రసవాల సంఖ్య నెలనెలకూ తగ్గుతోంది.
డిపో పునరుద్ధరణ ఊసేలేదు
నిడదవోలు ఆర్టీసీ డిపోను ఆదాయం తక్కువుగా ఉందనే సాకుతో 2006 ఆగస్టులో మూసివేశారు. ఇక్కడి బస్సులను తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, జంగారెడ్డిగూడెం తదితర డిపోలకు పంపారు. అప్పటినుంచి నియోజకవర్గంలో ప్రజలకు ప్రయాణ కష్టాలు మొదలయ్యాయి. బస్సులన్నీ వేరే డిపోల నుంచి రావడం వల్ల గంటల తరబడి ఆలస్యమవుతున్నాయని ప్రయాణికులు అంటున్నారు. కొన్నేళ్లుగా డిపో పునరుద్ధరించాలని ప్రజా సంఘాలు, ప్రజలు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
ఆగని సూపర్ ఫాస్ట్‌లు
నిడదవోలు రైల్వే జంక్షన్ అయినా సూపర్‌ఫాస్ట్ రైళ్లు ఆగకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. జన్మభూమి, లోకమాన్య తిలక్, కాకినాడ ఏసీ స్పెషల్ తదితర రైళ్లకు హాల్ట్‌లు కల్పించాలని డిమాండ్ ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
గ్రామాల్లో మరిన్ని సమస్యలు
నిడదవోలు మండలంలో ఇందిరమ్మ ఇళ్ల స్థలాలకు మెరక పనులు చేపట్టకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. ఉండ్రాజవరం మండలంలో డెల్టా ఆధునికీకరణ పనులు నెమ్మదించాయి. మోర్తాలో మురుగు కాలువ పూడిపోవడంతో 5 గ్రామాల్లో 3 వేల ఎకరాలకు సాగునీరందడం లేదు. పెరవలి మండలం కానూరులో బీసీ హాస్టల్ భవన నిర్మాణం పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి.
కలగా.. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్
పట్టణంలో తాగునీటి ఎద్దడి నివారణకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదనలు చేసినా పనులకు మోక్షం కలగడం లేదు. విజ్జేశ్వరం హెడ్‌స్లూయిజ్ వెనుక నుంచి పైపులైన్ ద్వారా గోదావరి జలాలను పట్టణానికి తరలించాలని 2013లో సుమారు రూ.52 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే కార్యరూపం దాల్చకపోవడంతో వేసవిలో తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు.
ఎర్రకాలువ ముంపు కష్టాలు
ఏటా వర్షాకాలంలో ఎర్రకాలువ వరద ముంపుతో మండలంలోని సింగవరం, కంసాలిపాలెం, ఉనకరమిల్లి, తాడిమళ్ల, శంకరాపురం, కాటకోటేశ్వరం, తాళ్లపాలెం, తిమ్మరాజుపాలెం, అట్లపాడు గ్రామాల్లో వేలాది ఎకరాలు ముంపునకు గురువుతున్నాయి. నివారణ కోసం శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నా ఫలితం ఉండటం లే దు. ముంపునకు కారణమవుతున్న నందమూరు పాత అక్విడెక్ట్‌ను తొలగించాలని రైతులు కోరుతున్నారు.