టీడీపీలో టెన్షన్..టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఓటు కోసం ఏకంగా అయిదు కోట్లు ఎర చూపిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఉదంతంలో సీఎం చంద్రబాబు సైతం నేరుగా దొరికిపోవడంతో తెలుగుదేశం నేతల్లో టెన్షన్ నెలకొంది. ఇది ఏ మలుపు తిరుగుతుందోనని తీవ్ర ఉత్కంఠతో ఉన్నారు. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో బాబు ఫోన్‌లో నేరుగా మాట్లాడిన సంభాషణ బయటకు పొక్కిన నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు టీడీపీ నేతలు పలు దఫాలుగా బాబుతో సమాలోచనలు జరిపారు.
ఈ వ్యవహారం పార్టీ ప్రతిష్టను బాగా దెబ్బతీసిందన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తమైంది. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితిల్లోంచి ఏదోవిధంగా బయటపడటానికి ప్రయత్నించాలని, టెలిఫోన్ సంభాషణను ఫోన్ ట్యాపింగ్ అంశంగా మార్చి దాన్నే ప్రధానంగా ప్రస్తావించాలని నిర్ణయించారు. ఈ కేసు వ్యవహారం బాబు వ్యక్తిగతమైనప్పటికీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివాదంలా చేయడం ద్వారా ప్రజల దృష్టిని కొంతైనా మళ్లించడానికి వీలవుతుందని నిర్ణయానికొచ్చారు.
ఆ వెంటనే జిల్లాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం, ఆయనపై కేసులు పెట్టడం వంటి చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లా నేతలకు ఆదేశాలిచ్చారు. మహాసంకల్పం సభ కోసం గుంటూరు చేరుకున్న జిల్లాల నేతలు అక్కడి నుంచే తమ అనుయాయులను పురమాయించారు. ఇలావుండగా, నామినేటెడ్ ఎమ్మెల్యేతో ఫోన్‌లో బాబు జరిపిన సంభాషణ ట్యాపింగ్ ద్వారా బయటపడింది కాదన్న భావన నేతల్లో వ్యక్తమవుతోంది. ఒకవేళ అది నామినేటెడ్ ఎమ్మెల్యే తన ఫోన్‌లో రికార్డు చేసిన వ్యవహారమని తేలితే మటుకు మరోసారి చిక్కుల్లో పడకతప్పదేమోనన్న ఆందోళనలో ఉన్నారు.
నేడు కేబినెట్ అత్యవసర భేటీ
తాజా పరిణామంతో షాక్‌కు గురైన చంద్రబాబునాయుడు మంగళవారం అత్యవసరంగా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఇది పూర్తిగా చంద్రబాబు ఆడియో టేపుల వ్యవహారమే ఎజెండాగా సాగనున్నట్టు తెలిసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతల అంశం గవర్నర్ పరిధిలో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పబడుతూ తీర్మానం చేయనున్నారు.
కేంద్రానికి ఫిర్యాదు చేయడానికి వీలుగా మంత్రివర్గంలో తీర్మానం చేయనున్నట్టు సమాచారం. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ఏపీ ప్రజల సానుభూతి పొందడానికి, ఇరు రాష్ట్రాల మధ్య వివాదంగా మలచడానికి వీలుగా మరో తీర్మానం చేసే అవ కాశం కూడా ఉందని తెలుస్తోంది. కేబినెట్ భేటీ తర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు.