ఇదేమి చోద్యం..!
టీడీపీ కార్యాలయ నిర్మాణం కోసం.. టౌన్‌హాల్ ప్రతిపాదన
అనుమతులు లేకున్నా నిర్మాణానికి ఏర్పాట్లు
18న శంకుస్థాపన చేయనున్న సీఎం
ఎన్‌ఎస్‌పీ కెనాల్స్ భూమిలో
పార్టీ కార్యాలయమా..!
ముక్కున వేలేసుకుంటున్న జనం
చిలకలూరిపేటటౌన్ : అనుమతులు లేని ఆర్భాటానికి అధికారులు తెరతీశారు. ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా మారింది వారి తీరు. ప్రాథమిక అవసరమైన భూమి బదలాయింపు కూడా జరగకముందే టౌన్‌హాలు, టీడీపీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్‌ఎస్‌పీ కెనాల్స్ డివిజనల్ కార్యాలయ సముదాయ భూమిలో 18వ తేదీన సీఎం చంద్రబాబు ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.ఇదీ విషయం..చిలకలూరిపేట పట్టణ పరిధిలో ఎన్‌ఆర్‌టీ రోడ్డులోని ఎన్‌ఎస్‌పీ కెనాల్స్ డివిజనల్ కార్యాలయం, సిబ్బంది క్వార్టర్లు ఉన్నాయి. సర్వే నంబర్ 128-1ఏ లో 0.309 ఎకరాలు, సర్వే నంబర్ 127లో 0.145 ఎకరాలు, సర్వే నంబర్ 123-సీలో 4.710 ఎక రాలు.. మొత్తం 5.164 ఎకరాల భూమి ఉండేది. ఇందులో జూనియర్ కాలేజీ నిర్వహణ కోసం చిలకలూరిపేట విద్యాసంఘానికి 1998లో జీవో నంబర్ 245 ద్వారా ప్రభుత్వం రూ.6,56,299కు భూమి బదలాయింపు చేసింది.
మిగిలిన 3.07 ఎకరాల్లో కెనాల్స్ కార్యాలయం సిబ్బంది క్వార్టర్లు పోను కొంత ఖాళీస్థలం ఉంది. ఈ మొత్తం సముదాయం నుంచి రెండు ఎకరాల స్థలం టౌన్ హాలు నిర్మాణానికి కేటాయించాలని పురపాలక సంఘం వారు, పనిలో పనిగా 0.50 ఎకరాల స్థలాన్ని అధికార టీడీపీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించాలని ఆ పార్టీ వర్గాలు కోరాయి. ఈ ప్రతిపాదనల విషయమై ఎన్‌ఎస్‌పీ కెనాల్స్ ఎస్‌ఈ ఎంవీ కృష్ణారావు 2015 అక్టోబర్ 23న కల్టెకర్‌కు సమాధానమిస్తూ ప్రస్తుతం మిగిలి ఉన్న 3.07 ఎకరాల భూమిలో 1.07 ఎకరాలు తమ కార్యాలయం, స్టాఫ్ క్వార్టర్ల కోసం అవరమని, ప్రభుత్వం కోరిన పక్షంలో మిగిలిన రెండెకరాల భూమి నిబంధనలకు లోబడి కేటాయించాల్సి ఉంటుందని తెలిపారు.
అటకెక్కిన గత ప్రతిపాదనలు..
ఇదే స్థలంలో నాడు ఎమ్మెల్యేగా ఉన్న నేటి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి 2003 నవంబర్ 14వ తేదీన సాంఘిక సంక్షేమశాఖ బాలికల వసతి గృహ నిర్మాణానికి శంకుస్తాపన చేశారు. అది కార్యరూపం దాల్చలేదు. అనంతరం 2009లో టీటీడీ పాలక మండలి సభ్యుడు, అప్పటి ఎమ్మె ల్యే మర్రి రాజశేఖర్ కొంత భాగం భూమిలో టీటీడీ కల్యాణ మండప నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ఒక ప్రభుత్వ శాఖకు చెందిన భూమిని మరో శా ఖకు బదిలీ చేయాలంటే క్యాబినేట్ తీర్మానం చేయాల్సి ఉ ండటం, ఆ తదుపరి ఎన్నికల్లో ఆయన విజయం సాధిం చకపోవటంతో ఆ ప్రాతిపాదన కార్యరూపం దాల్చలేదు. ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న ఎన్‌ఎస్‌పీ సిబ్బంద ప్రాతిపాదనలను నిరసిస్తూ ఇప్పటికే స్థానిక ఎన్‌ఎస్‌పీ కెనాల్స్ కాలనీలో నివాసం ఉండే సిబ్బంది ఇటీవల కలెక్టర్‌కు వినతిపత్రం పంపారు. శుక్రవారం భూమి కొలతలు వేసేందుకు వచ్చిన జిల్లా సర్వేయర్ జేపీ శర్మ, స్థానిక మండల సర్వేయర్ వై.ప్రసాద్‌ల ఎదుట అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ప్రతిపాదనలే పంపాం..
టీడీపీ కార్యాలయ భవనానికి భూమి కేటాయింపు విషయం తహశీల్దార్ పీసీహెచ్ వెంకయ్యను వివరణ కోరగా తాము ప్రతిపాదనలు మాత్రమే పంపామని, భూమి విక్రయం, లేదా లీజుకు కేటాయించేది ఉన్నతాధికారులేనని తెలిపారు. ఇదే విషయాన్ని ఎన్‌ఎస్‌పీ కెనాల్స్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎం.వి.కృష్ణారావును ఫోన్లో వివరణ కోరగా భూమి బదలాయిస్తూ ఇప్పటిదాకా జీవో రాలేదని చెప్పారు.