ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై అనైతిక వ్యాఖ్యలు చేయడాన్ని జిల్లాకు చెందిన ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు తన నోటిని అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. బాధ్యతాయుత పదవిలో ఉండి ప్రధాన ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి మీకు సిగ్గులేదా, మీకు పిచ్చిపట్టిందంటూ వాఖ్యలు చేయడం ప్రజలను అవమానపరచడమేన్నారు.శాసనసభలో ప్రతిపక్ష నాయకుల వైపు వేలు చూపుతూ ‘ఎవరినీ వదలను.. మీ సంగతి చూస్తా.. నా సంగతి తెలీదంటూ’ వీరంగం సృష్టించడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో 15కు 15 ఎమ్మెల్యే స్థానాలనూ కట్టబెట్టి నందుకు కృతజ్ఞత పూర్వకంగా ఇక్కడి ప్రజలకు అవసరమైన పథకాలు అమలు చేయాల్సి ఉండగా కనీస విశ్వాసం కూడా చూపకుండా ఈ జిల్లా రైతుల పొట్ట కొడుతూ గోదావరి జలాలను పక్క జిల్లాకు తరలించడానికి, కాంట్రాక్టుల పేరుతో టీడీపీ నాయకుల జేబులు నింపడానికి ఉద్దేశించి మాత్రమే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని బలవంతంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు. ఈ ప్రయత్నాన్ని నిలువరించడానికి చర్చల కోసం డిమాండ్ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కారణంగా పథకం ఆగిపోతుందేమోనని భయపడి తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సభా మర్యాదలను ఉల్లంఘించడమేనని పలువురు నాయకులు పేర్కొన్నారు.
అవినీతిని ప్రశ్నించినందుకే..
పట్టిసీమ ఎత్తిపోతల పేరుతో టీడీపీ నాయకుల జేబులు నింపడానికి చేపడుతున్న ప్రయత్నాన్ని, ఈ పథకం కోసం 22 శాతం అధికంగా ఉన్న టెండర్లను అనుమతించడాన్ని ప్రశ్నించడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నాడు. ప్రజాస్వామ్మ దేశంలో సాధారణ పౌరుడికే ప్రశ్నించే అధికారం ఉండగా ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించడం తప్పా?
- చీర్ల రాధయ్య,
తణుకు నియోజకవర్గ కన్వీనర్
ప్రజలకు క్షమాపణ చెప్పాలి
రాక్షసుడు, నియంత, గూండా, రౌడీ వంటి నామవాచకాలన్నింటికీ సరి పోయేది ఈ ప్రపం చంలో చంద్రబాబు ఒక్కడే. ప్రజలను మోసం చేసి అధికారంలో కొనసాగుతున్న చంద్రబాబుకు సిగ్గులేదా లేక మా పార్టీ నాయకులకా అనేది ప్రజలకు బాగా తెలుసు. బాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. బాబు నోరుపారేసుకోవడాన్ని ప్రపంచమంతా ముక్కున వేలేసుకుని చూసింది.
- తెల్లం బాలరాజు,
పార్టీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు
జగన్‌పై విమర్శలకే...
టీడీపీకి, చంద్రబాబుకు శాసనసభలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి తప్ప వేరే చర్చనీ యాంశాలు లేవు. వారిపై విమర్శలు గుప్పించడానికే సభ నిర్వహిస్తున్నారు. ప్రజల కోసం ప్రభుత్వం ఏమి చేస్తుందో చెప్పుకోలేని పరిస్థితిలో టీడీపీ నాయకులున్నారు. ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ప్రకటించలేని ప్రభుత్వానికి ప్రతిపక్షాన్ని విమర్శించే నైతిక హక్కు లేదు.
- తలారి వెంకట్రావు,
గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్
అసెంబ్లీలో బెదిరింపులా
చంద్రబాబు నోరు మునిసిపాలిటీ డంపింగ్ యార్డు లాంటిది. నోరు తెరిస్తే అంతా కంపే. బాధ్యతాయుత పదవికి సరితూగని వ్యక్తి. శాసనసభను బెదిరింపులకు, హెచ్చరికలకు వాడుకోవడం హేయమైన చర్య. ప్రజలకు అండగా ఉంటామని మా నాయకుడు అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు భరోసా ఇవ్వడం బాబుకు కంటిమీద కునుకుని దూరం చేసింది. అందుకే ఈ పిచ్చి ప్రేలాపనలు.
- పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
బాబూ.. నోటిని అదుపులో పెట్టుకో
Published Wed, Mar 18 2015 3:16 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement