- వై.పాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు విమర్శ
యర్రగొండపాలెం : రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు విమర్శించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పింఛన్‌దారుల్లో ఎవరు అర్హులో..ఎవరు అనర్హులో తేల్చేందుకు కమిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జీవో విడుదల చేసిందన్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు పదవుల్లోలేని ప్రాంతాల్లో కూడా ఆయా ప్రాంతాల టీడీపీ నాయకులతోనే కమిటీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. గ్రామపంచాయతీ నుంచి జిల్లాస్థాయి వరకు ఉన్న ఇతర పార్టీల ప్రజాప్రతినిధుల హక్కులను హరించే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గ్రామ కమిటీల్లో ఆయా ప్రాంతాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. కానీ, అధికారపార్టీకి చెందిన నాయకులను పరోక్షంగా కమిటీల్లో చేర్చి పింఛన్ల వెరిఫికేషన్ చేయించడం ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి అద్దంపడుతోందన్నారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిధంగా కమిటీల జీవో ఉందన్నారు. జీవో విడుదల కాకముందే అధికారులు కమిటీలు ఏర్పాటు చేశారని డేవిడ్‌రాజు పేర్కొన్నారు. అధికారులు పంపిన జాబితాను జిల్లా కేంద్రంలో మార్చివే స్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో ఎన్నడూ తాను ఇటువంటి పాలన చూడలేదన్నారు. గతంలో తొమ్మిదేళ్లు పాలించిన తర్వాత టీడీపీపై ప్రజావ్యతిరేకత వచ్చిందని, ప్రస్తుతం 90 రోజుల పాలనలోనే ప్రజావ్యతిరేకతను ఆ పార్టీ ఎదుర్కొంటోందని డేవిడ్‌రాజు విమర్శించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికలముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల మన్ననలు పొందాలని, అంతేతప్ప టీడీపీ నేతలు, కార్యకర్తలకు దోచిపెట్టి కాదని ఆయన హితవు పలికారు. పింఛన్లు పెంచినట్లు పెంచి వెరిఫికేషన్ పేరుతో కోత విధించడానికి ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఏకపక్ష కమిటీలు ఏర్పాటుచేస్తే న్యాయపోరాటానికి తామంతా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
అధికారులకు తాము అండగా ఉంటామని, కమిటీలు ఏర్పాటు చేసే సమయంలో రాజకీయాలకు అతీతంగా ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులను కలుపుకోవాలని డేవిడ్‌రాజు కోరారు. విలేకరుల సమావేశంలో వై.పాలెం ఎంపీపీ చేదూరి విజయభాస్కర్, మండల ఉపాధ్యక్షుడు కందుల కాశిరెడ్డి, కో ఆప్షన్ సభ్యులు షేక్ మౌలాలి, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
రాష్ట్రంలో నియంత పాలన
Published Fri, Sep 19 2014 3:19 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
Advertisement
Advertisement