పాతపాటే పాడిన చంద్రబాబు
పోలవరం ప్రాజెక్ట్‌పై
మాట మార్పు
భీమవరంలో 150 ఎకరాల్లో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటన
ద్వారకాతిరుమల సమీపంలో
విర్డ్ ఆసుపత్రి భవనం ప్రారంభం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలో భూ సమస్య తీవ్రంగా ఉందని.. భూములిచ్చేందుకు ముందుకొస్తే పరిశ్రమలన్నీ పశ్చిమగోదావరికే తీసుకువస్తామని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ద్వారకాతిరుమల సమీపంలో శారీరక వికలాంగుల కోసం నిర్మించిన వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహేబిలిటేషన్ ఫర్ డిజేబుల్డ్ (విర్డ్) ఆసుపత్రిని సీఎం చంద్రబాబు గురువారం ప్రారంభిం చారు. తొలుత ద్వారకాతిరుమల చినవెంకన్నను దర్శించుకున్న ముఖ్య మంత్రి అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత విర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి భూ సమస్య అడ్డంకిగా ఉందని ఆయన చెప్పారు. ద్వారకాతిరుమలకు సమీపంలో ఉన్న 17వేల ఎకరాల అటవీ భూములను డీనోటిఫై చేసి పెద్దఎత్తున పరిశ్రమలకు నెలకొల్పుతామని ప్రకటించారు. భీమవరంలో ఆక్వా యూని వర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందుకోసం 150 ఎకరాల భూమి ఇచ్చేందుకు ముందుకొచ్చిన విశ్వనాథరాజును అభినందించారు. ఆయిల్‌పామ్, పొగాకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
పోలవరం నిర్మాణంపై తడవకో మాట
గత నెల ఆగస్టు 15న పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ పట్టిసీమ నిర్మాణం స్ఫూర్తితో మూడేళ్లలోపే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు భిన్నంగా గురువారం నాటి సభలో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేం దుకు నాలుగైదేళ్లు పడుతుందని చెప్పారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను ఈ ఏడాది ప్రారంభించి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. ఈనెల 16న పట్టిసీమ ఎత్తిపోతల పథకం తొలిదశను ప్రారంభించి గోదావరి జలాలను కృష్ణాడెల్టాకు తరలిస్తామన్నారు.
ద్వారకాతిరుమలకు
పాత హామీలే
గత ఏడాది జూలై 16న తొలిసారి జిల్లాకు వచ్చిన చంద్రబాబు ద్వారకాతిరుమలలో పర్యటించిన విష యం విదితమే. ఆ సందర్భంగా తిరుమల తిరుపతికి దీటుగా చినతిరుపతిని అభివృద్ధి చేస్తామని, ఈ ప్రాంతాన్ని టౌన్‌షిప్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుం టామని ప్రకటించారు. ఎడ్యుకేషనల్, వైద్య హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. 14 నెలల తర్వాత గురువారం ఇక్కడకు వచ్చిన సీఎం తిరిగి అవే హామీలు గుప్పించారు. గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అడిగిందే తడవుగా ద్వారకాతిరుమలలో నర్సింగ్, గోపాలపురంలో జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేస్తామని, పిచ్చికగండి బ్రిడ్జి, జగన్నాధపురం- గజ్జవరం రోడ్డు నిర్మిస్తామని వాగ్దానాలు ఇచ్చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అమలు చేస్తున్న ప్రాణదానం ట్రస్ట్ తరహాలో ద్వారకాతిరుమల పరిధిలో కూడా ప్రాణదానం ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ఆలయ చైర్మన్ ఎస్‌వీ సుధాకరరావును చైర్మన్‌గా, అనంతకోటిరాజును వర్కింగ్ చైర్మన్‌గా నియమిస్తున్నట్టు చెప్పారు. తిరుమల తరహాలోనే చినవెంకన్న దర్శనానికి వచ్చే ప్రతి భక్తునికి అన్నదానం చేసే విధంగా ట్రస్ట్‌ను తీర్చిదిద్దాలన్నారు.
రాజు వేగేశ్న ఫౌండేషన్‌కు బాబు ప్రశంసలు
వికలాంగులకు చేయూత అందిం చేందుకు రాజు వేగేశ్న ఫౌండేషన్ ముం దుకు వచ్చి విర్డ్ సంస్థను నెలకొల్పడం అభినందనీయమని సీఎం ప్రశంసిం చారు. రూ.13.50 కోట్లతో ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టిన విర్డ్ చైర్మన్ అనంతకోటిరాజు అభినందనీయులని సీఎం అన్నారు. విర్డ్ ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ కూడా అమలయ్యేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు.
సీఎంకు పెళ్లిరోజు శుభాకాంక్షలు
జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడుకు ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పారు. గురువారం చంద్ర బాబు పెళ్లి రోజు అని తెలియడంతో ఆయనకు బొకేలు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్, విప్‌లు అంగర రామ్మోహనరావు, చింతమనేని ప్రభాకర్, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎంపీలు మాగంటి మురళీ మోహన్, మాగంటి బాబు, తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్సీలు ఎంఎ షరీఫ్, కంతేటి సత్యనారాయణరాజు, ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, గన్ని వీరాంజనేయులు, వేటుకూరి శివరామరాజు, పులపర్తి రామాంజనేయులు, బండారు మాధవనాయుడు, నిమ్మల రామానాయుడు, కేఎస్ జవహర్, బడేటి బుజ్జి పాల్గొన్నారు.
భూములిస్తే పరిశ్రమలన్నీ పశ్చిమకే..
Published Fri, Sep 11 2015 1:44 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM
Advertisement
Advertisement