
నది రుణాన్ని తీర్చుకోండి
ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, అమరావతి: ‘నది మనకు నీళ్లు, సంపద అన్నీ ఇస్తుంది. అలాంటి నదికి మనం రుణం తీర్చుకోవాలి’ అని ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అమరావతిలో మంగళవారం మధ్యాహ్నం ధ్యానబుద్ధ ఘాట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి పుష్కరాల్లో సంకల్పం చేసి కృష్ణమ్మ చెంతకు గోదావరిని చేర్చామన్నారు. ఇప్పుడు ఆ రెండు నదులు కలిసే పవిత్ర సంగమం వద్దనే హారతిని ఇస్తున్నామన్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా మహా సంకల్పం చేస్తున్నామని, కృష్ణ నుంచి గోదావరి నీళ్లు పెన్నాలో కలిపి నదుల అనుసంధానం చేస్తామని తెలిపారు.
వర్షపునీటిని భూగర్భ జలాలుగా మార్చుకునేందుకు చెరువుల్లో పూడిక తీతలు, ఫాంపాండ్స్ తవ్వి, వాటిని భూగర్భ జలాలుగా మారిస్తే కరువు ఉండదన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పుష్కర స్నానాల ప్రచారం చేయాలన్నారు. గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పలుచోట్ల భోజనాలు పెడుతున్నారని, ఇది స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతి ఒక్కరూ పుష్కరస్నానం చేయాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పుష్కర ఏర్పాట్లు పక్కాగా చేశామని తెలిపారు.