అనుయాయులకు పనులు..అధికారులకు చీవాట్లు
పన్నెండేళ్లకోసారి పుష్కరాలొస్తాయి. ఈ విషయం సామాన్యులకే కాదు ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకూ తెలుసు! కోట్లమంది భక్తులు పుణ్యస్నానాలకు వచ్చే ఈ క్రతువు మరో రెండు రోజుల్లో రానే వస్తోంది. కానీ ఏర్పాట్లు మాత్రం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగానే ఉన్నాయి. ఈ తరుణంలో కూడా పుష్కరాల పనులు పూర్తి చేయని, అస్తవ్యస్తంగా చేసిన కాంట్రాక్టర్లను పల్లెత్తు మాట కూడా అనని సీఎం శనివారం జరిపిన ఆకస్మిక తనిఖీల్లో కనిపించిన ప్రతి అధికారిపైనా ఆగ్రహం వ్యక్తం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సాక్షి, రాజమండ్రి :పుష్కరాలు ఈ నెల 14 నుంచే ప్రారంభమవుతున్నప్పటికీ 13వ తేదీ సాయంత్రం నుంచే భక్తుల హడావుడి ప్రారంభమైపోతుంది. ఇప్పటివరకూ పనులను సమీక్షించడమో, ఘాట్‌లను చూసి వెళ్లిపోవడమో చేసిన చంద్రబాబు.. శనివారం అందుకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఆకస్మిక తనిఖీలకు తెర తీశారు. ఉదయం 10.40 గంటలకే మధురపూడి విమానాశ్రయానికి సీఎం వస్తారని అధికారులు ముందుగా ప్రకటించినా.. ఆయన వచ్చేసరికి మధ్యాహ్నం ఒంటిగంట అయ్యింది. భారీ సంఖ్యలో వాహనాలతో బయల్దేరిన సీఎం కాన్వాయ్ మూడుసార్లు దారి తప్పింది. తొలుత ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి వెళ్లి తర్వాత ఘాట్‌ల పరిశీలనకు వెళ్తారని అధికారులు మొదట చెప్పారు.
కానీ సీఎం నేరుగా ఘాట్‌లకు బయల్దేరారు. మధ్యాహ్న భోజన సమయం కావడంతో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు అవసరమైన స్థాయిలో పోలీసు సిబ్బంది లేరు. దీనికితోడు తనిఖీ కోసం ఎక్కడికక్కడ ఆగుతుండటంతో కాన్వాయ్ మొత్తం నిలిచిపోయేది. అసలే మధ్యాహ్నం మండుటెండ, ఉక్కపోతతో సతమతమవుతున్న వాహనదారులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి నానా అవస్థలూ పడ్డారు. కోటిలింగాల రేవును పరిశీలించేందుకు వెళ్తూ మార్గమధ్యంలో దేవీచౌక్‌లోని పశువైద్యకేంద్రం వద్ద సీఎం ఆగారు. అక్కడ డ్రైన్‌లో చెత్త పేరుకుపోవడం, పారిశుధ్య లోపం కనిపించడంపై సంబంధిత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ సతీష్‌ను, మేస్త్రిని సస్పెండ్ చేస్తూ అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. అయితే నగరమంతా పరిస్థితి ఇలాగే ఉందని, కాంట్రాక్లర్ల నిర్లక్ష్యం వల్ల ఏ పనీ పూర్తి కాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అదే మార్గంలో త్రీటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద సీఎం ఆగారు. అక్కడ పోలీసు హోప్ ల్యాండ్‌ను పరిశీలించారు. అది తుప్పుపట్టి ఉండటంతో రంగులు వేయలేదా? అని రాజమండ్రి అర్బన్ జిల్లా ఎస్పీ హరికృష్ణను నిలదీశారు. అప్పటికే బ్యారికేడ్ల ఏర్పాటుపై ఆగ్రహంతో ఉన్న సీఎం ఈ సందర్భంలో ఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత సీఎం ఆర్యాపురంలో ఆగి నల్లా చానల్‌ను పరిశీలించారు. అక్కడ దుర్గంధాన్ని తట్టుకోలేకపోతున్నామని స్థానిక మహిళ ఒకరు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
గంటల తరబడి విద్యుత్తు వెతలు
సిటీలో హైటెన్షన్ విద్యుత్ వైర్ల మార్పిడి పనులు ఆలస్యం కావడం, ప్రధాన రహదారుల వెంబడి గృహ వినియోగ సర్వీసు వైర్లను రోడ్డుకు అడ్డంగా లేకుండా మార్చడం తదితర పనులన్నీ ఆలస్యంగానే ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ అవి కొలిక్కిరాకపోవడంతో రోజుల తరబడి విద్యుత్తు కోతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీనిని స్థానికులు సీఎం దృష్టికి తీసుకెళ్లినా ఆయన పెద్దగా స్పందించలేదు.
లోపాలు కనిపించకుండా డ్రామా!
పుష్కరాల పనుల్లో లోటుపాట్లపై ఇప్పటికే ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక మంత్రి నారాయణ కలిసి నిర్వహించిన సమీక్షలోనే అనేక లోటుపాట్లు కళ్లకు కట్టాయి. అవన్నీ ఈ రెండు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకా శం కనిపించటం లేదు. కాంట్రాక్టు పనులు చేపట్టింది ‘పచ్చ’ నేతల వందిమాగదులు కావడంతో ఆ లోటుపాట్లను కప్పిపుచ్చేందుకే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రజల నుంచి మార్కులు కొట్టేసేందు కు సీఎం కొత్త ఎత్తు వేసినట్టుగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు.