జ్ఞాపకశక్తి దెబ్బతింటోందా బాబూ?
- సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ ఉండవల్లి సూటి ప్రశ్నలు
దేవీచౌక్ (రాజమండ్రి): ‘గోదావరి పుష్కరాల తొలిరోజు తొక్కిసలాట జరిగిన రేవు, తాను పుష్కర స్నానం చేసిన రేవు వేర్వేరని సీఎం అన్నట్లు వార్తలు వస్తున్నాయి. వృద్ధాప్యం వల్ల ఆయన జ్ఞాపకశక్తి దెబ్బ తింటోందా.. లేక మానసిక స్థితిలో ఏమైనా తేడా వచ్చిందా? ఈ రెండూ కాకపోతే ప్రజలను మోసం చేస్తున్నారా’ అని సీఎం చంద్రబాబును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రశ్నించారు. రాజ మండ్రి పుష్కరాల రేవులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
‘గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ జ్ఞాపకశక్తికి సంబంధించిన అల్జీమర్‌తో బాధపడ్డారు. సీనియర్ ఎంపీ జార్జి ఫెర్నాండెజ్ కూడా అదే వ్యాధి బారిన పడ్డారు. ఇప్పుడు సీఎం చంద్రబాబుకు కూడా అలాంటి వ్యాధి సోకిందన్న అనుమానాలు కలుగుతున్నాయి’ అని ఎద్దేవా చేశారు. తొక్కిసలాట జరిగి 45 రోజులవుతున్నా నిజాలు నిగ్గుతేలుతాయనే విచారణకు ఆదేశించలేదా అని సీఎంను నిలదీశారు. ఒక్కరు చనిపోయినా విచారణకు ఆదేశించాల్సిందేనని స్పష్టం చేశారు.