అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
కొవ్వూరులో పుష్కర పనుల పరిశీలన
గోష్పాద క్షేత్రంలో ఏర్పాట్లపై సంతృప్తి
కొవ్వూరు : గోదావరి పుష్కరాలకు ఆదివారం అన్ని శాఖలు ట్రయల్ రన్ నిర్వహించాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో శనివారం సాయంత్రం ఆయన పుష్కర ఏర్పాట్లను పరిశీలించారు. స్నానఘట్టంలో ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కె.భాస్కర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఘాట్‌లో నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా, భక్తులు స్నానాలు చేసేందుకు అనువుగా ఉంచాలని ఆదేశించారు. ఘాట్లలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నదిలో పిండ ప్రదానాలు చేసిన సామగ్రి, పూజా ద్రవ్యాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని కలెక్టర్‌కు సూచించారు. ప్రత్యేకంగా రూపొందించిన వలతో నదిలోని చెత్త, ఇతర వ్యర్థాలను ఎప్పటికప్పుడు ఈతగాళ్లు ఎలా తొలగిస్తారో సీఎంకు చూపించారు. అనంతరం సమాచార శాఖ రూపొందించిన పుష్కర కరపత్రాలను సీఎం ఆవిష్కరించారు.
జిల్లా రైస్‌మిల్లర్ల అసోసియేషన్, జిల్లా ఆర్యవైశ్య సంఘం కొవ్వూరులో ఏర్పాటు చేసిన అన్నదాన ప్రాంగణాలను, యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లను, బారికేడ్లను సీఎం పరిశీలించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన తాగునీటి సింటెక్స్ ట్యాంకును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. వెల్‌డన్ ఏర్పాట్లు బాగున్నాయని అని కలెక్టర్ కె.భాస్కర్‌ను ప్రశంసించారు. గోష్పాద క్షేత్రంలో ఏర్పాట్లు బాగా చేశారని సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి పీతల సుజాత, ఎంపీ మాగంటి మురళీ మోహన్, జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్యేలు కేఎస్ జవహర్, గన్ని వీరాంజనేయులు, కలువపూడి శివ, ముప్పిడి వెంకటేశ్వరరావు, మునిసిపల్ చైర్మన్ సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్ (చిన్ని), వైస్ చైర్మన్ దుద్దుపూడి రాజారమేష్, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, సూర్యదేవర రంజిత్, నీటిపారుదలశాఖ సీఈ ఎస్.హరిబాబు, ఎస్‌ఈ ఎస్.సుగుణాకరరావు తదితరులు పాల్గొన్నారు.
ట్రయల్ రన్ వేయండి
Published Sun, Jul 12 2015 12:27 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM
Advertisement
Advertisement