సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 25 లక్షల మందికి నివాస స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నివాస స్థలాల పంపిణీ కోసం ప్రతిపాదించిన ప్రతి ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్లు/జాయింట్ కలెక్టర్లు/రెవెన్యూ డివిజనల్ అధికారులు స్వయంగా పరిశీలించాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చినట్టు మనం ఇళ్ల స్థలాలను అసైన్‌మెంట్ పట్టాల రూపంలో ఇవ్వడం లేదని, రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నామన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి తరఫున జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లకు ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ల స్థలాలకు ప్రతిపాదించిన భూముల్లో కంపచెట్ల తొలగింపు, చదును చేయడం, సరిహద్దుల నిర్ధారణ పనులను వచ్చే వారంలో చేపట్టాలని సూచించారు. తాము పంపిన నమూనాలో భూముల సమాచారాన్ని సోమవారం సాయంత్రంలోగా వాట్సాప్ నంబరు 9013133636కు గానీ, మెయిల్‌కు గానీ పంపించాలని పేర్కొన్నారు.
దేశంలోనే చరిత్రాత్మక నిర్ణయం
‘‘ఇళ్ల పట్టాలు పొందిన వారు ఆ స్థలాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి, రుణాలు తీసుకునేందుకు వీలుగా లబ్ధిదారులందరికీ కన్వెయన్స్ డీడ్ (రిజిస్ట్రేషన్ పత్రం) ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అయిదేళ్ల తర్వాత వీటిపై విక్రయ హక్కులు కూడా కల్పిస్తోంది’’ అని ప్రవీణ్ ప్రకాశ్ రాసిన లేఖలో పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం చేపడుతున్న నివాస స్థలాల పంపిణీ విధానం దేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలకు సైతం మార్గదర్శకం అవుతుందని నమ్ముతున్నట్లు వెల్లడించారు. ప్రవీణ్ ప్రకాశ్ పంపిన సర్క్యులర్‌లోని ముఖ్యమైన అంశాలు..
- కలెక్టర్లు/జాయింట్ కలెక్టర్లు/సబ్ కలెక్టర్లు/ ఆర్డీఓలు వెళ్లి పరిశీలించనిదే ఆయా భూములు నివాస స్థలాలకు పనికొస్తాయా? లేదా అన్నది నిర్ధారించలేరు. కాబట్టి నివాస స్థలాలు ఇవ్వడానికి ప్రతిపాదించే ప్రతి భూమిని ఉన్నతాధికారులు తప్పకుండా పరిశీలించాలి.
- నివాస స్థలాలకు ప్రతిపాదించే భూములకు సంబంధించి కలెక్టర్లు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, కచ్చితంగా వచ్చే వారంలో అమలు చేయాలి. ప్రతి మండలంలో క్రమబద్ధంగా భూముల జాబితాను రూపొందించాలి. విభాగాల వారీగా భూముల జాబితాను రూపొందిస్తేనే ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయో అర్థం చేసుకుని, పరిష్కరించడానికి వీలవుతుంది. ఈ విభాగాలకు సంబంధించిన భూములన్నింటినీ నివాస స్థలాల కోసం వినియోగించుకుంటాం.
విభాగాల వారీగా భూముల జాబితా ఎలా ఉండాలంటే...
- సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న వివాదాస్పద భూములు
- రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలోని అప్పీళ్ల కమిషనర్ వద్ద పెండింగ్‌లో ఉన్న వివాదాస్పద భూములు
- రాష్ట్ర సర్వే సెటిల్‌మెంట్ కమిషనర్ వద్ద పెండింగ్‌లో ఉన్న వివాదాస్పద భూములు
- వివిధ ప్రభుత్వ విభాగాల అధీనంలో ఉన్న వినియోగించని భూములు
- ఇతరత్రా ప్రభుత్వ భూములు
Comments
Please login to add a commentAdd a comment