పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఈమె పేరు ఎం. స్వాతి. భర్త.. నాయుడు. వీరికి ఒక పాప, ఒక బాబు. కూలి పని ఉంటే ఆదాయం, లేకపోతే పస్తులు అన్నట్లుగా సాగే వీరికి పిల్లలను ప్రైవేటు–కార్పొరేట్ స్కూళ్లలో చదివించడం భారంగా మారింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారు. కొద్దిపాటి ఫీజులు మాత్రమే చెల్లించాల్సి ఉన్నా నోటు పుస్తకాలు, పెన్నులు, ఇతర విద్యా సామగ్రి కొనుగోలు కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న అమ్మ ఒడి పథకం వీరికి ఎడారిలో ఒయాసిస్సులా కనిపిస్తోంది.
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం రాష్ట్రంలోని లక్షలాది నిరుపేద తల్లులకు కొండంత అండగా నిలుస్తోంది. పేద పిల్లల చదువులపై భరోసా కల్పిస్తోంది. పిల్లల చదువులపై ఆందోళనతో ఉన్న మాతృమూర్తులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకం ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తోంది. దీంతో ప్రతి పేద తల్లి తన పిల్లలను పనికి కాకుండా బడికి పంపి వారికి బంగారు భవిత కల్పించేందుకు అడుగులు వేస్తోంది.
సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా..
దేశంలోనే మొట్టమొదటిసారిగా సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. అర్హురాలైన ప్రతి తల్లికీ ఈ పథకం వర్తించేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంది. తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా.. ‘నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నాను’ అంటూ చెప్పిన ప్రతీ మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిజం చేస్తున్నారు. ఇందులో భాగంగా.. నవరత్నాలలోని మరో కీలక హామీ ‘అమ్మ ఒడి’ని నెరవేర్చేందుకు ముందడుగు వేస్తున్నారు. ఈనెల 9న చిత్తూరులో ముఖ్యమంత్రి ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. చదువుకు పేదరికం ఎప్పుడూ ఆటంకం కాకూడదన్న మహోన్నత లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రకటించిన ఈ పథకం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. దీనివల్ల డ్రాపౌట్లు తగ్గడంతోపాటు పేద కుటుంబంలోని ప్రతి చిన్నారికి విద్య అందడం ద్వారా ఆయా కుటుంబాలు అభివృద్ధి సాధించగలుగుతాయన్నది పథకం లక్ష్యం.
రూ.6,455.80 కోట్లు మంజూరు
ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.6455.80 కోట్లు మంజూరు చేసింది. మొదటి విడతలో ఇప్పటివరకూ 42,80,823 మంది తల్లులను సర్కారు గుర్తించింది. ఒకొక్కరికి ఏటా రూ.15వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమచేయనుంది. మలివిడత పరిశీలన కొనసాగుతున్నందున ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది. 43 లక్షల మందికి పైగా తల్లులకు దీని ద్వారా మేలు చేకూరనుంది. ఈ పథకం ద్వారా 81,72,224 మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుంది. 1 నుంచి 10వ తరగతి వరకూ విద్యార్థులకు అమలుచేయాలని ముందు భావించినా తరువాత ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల తల్లులకూ ప్రభుత్వం వర్తింపజేస్తూ ఆదేశాలు జారీచేసింది. అన్ని ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలకూ ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నారు. 1 నుంచి 10 వరకు 72,77,387 మంది, ఇంటర్మీడియట్‌లో 8,94,837 మంది విద్యార్ధులకు ఈ లబ్ధి చేకూరనుంది. ఈ నేపథ్యంలో.. సర్కారు అందిస్తున్న సాయంతో పేద తల్లులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
జగనన్నకు రుణపడి ఉంటాం
నాకు ముగ్గురు కుమార్తెలు. కూలి పనులు చేసుకుంటూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించుకుంటున్నాను. సీఎం జగనన్న పెట్టిన అమ్మ ఒడి పథకం మాలాంటి వారికి ఎంతో అండగా నిలుస్తుంది. ఆ పథకం సాయంతో మా పిల్లలను బాగా చదివించుకుంటాను. వారి మంచి భవిష్యత్తుకు ఈ పథకం ఓ మంచి మార్గం. జగనన్నకు మేం రుణపడి ఉంటాం.
– సుహాసిని, గంగులయ్యగారిపల్లె, పెండ్లిమర్రి మండలం, వైఎస్సార్ జిల్లా
పిల్లల ఫీజులకు ఇక బెంగ ఉండదు
నా పేరు ఆదిమూలం సుజాత. నాకు ఇద్దరు పిల్లలు. కుమార్తె చెన్నూరులోని ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుకుంటుంది. కుమారుడు ప్రైవేటు స్కూల్లో 4వ తరగతి. అమ్మ ఒడి ద్వారా జగనన్న ఇచ్చే రూ.15 వేలతో పిల్లోడి ఫీజు చెల్లించడానికి వీలవుతుంది. ఆ భారం ఇక మాపై ఉండదు. వాడి చదువు గురించి డబ్బు బెంగ నాకు ఉండదు.
– ఆదిమూలం సుజాత, శివాలపల్లె, చెన్నూరు మండలం, వైఎస్సార్ జిల్లా
అమ్మఒడి ఎంతో ధైర్యాన్నిచ్చింది
చదువుకోవాలనే కోరిక ఉన్నా, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులవల్ల చదువుకు దూరమయ్యాం. మా అమ్మాయికి ఆ పరిస్థితి రాకుండా భార్యాభర్తలిద్దరం కష్టపడుతున్నాం. మాలాంటోళ్లకు జగనన్న అమ్మ ఒడి పథకం ఎంతో ధైర్యాన్నిచ్చింది. ప్రభుత్వం మాకు అండగా నిలిచింది. దీంతో అమ్మాయిని బాగా చదివించుకుంటాం.
– వాగు సుప్రియ, మచిలీపట్నం, కృష్ణాజిల్లా
పిల్లల చదువులకు ఊతం
పేదరికం వల్ల మాకు చదువులంటే తెలియదు. మా బిడ్డలనైనా బాగా చదివించుకోవాలనే తపన ఉంది. కానీ, ఆర్థిక స్థోమతలేక అవస్థలు పడుతున్నాం. భార్యాభర్తలిద్దరం రైతుబజార్‌లో కూరగాయాలు అమ్ముతుంటాం. జగనన్న ప్రవేశపెడుతున్న అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా రూ.15వేల సాయం మాకు ఎంతో ఊతమిస్తోంది.
– ఒడుగు నారాయణమ్మ, మచిలీపట్నం, కృష్ణాజిల్లా
‘అమ్మఒడి’ మాలాంటి వారికి వరం
నా భర్త కాటూరి లక్ష్మణరావు. మాకు ఇద్దరు మగపిల్లలు. నేను, నా భర్త కూలి పనిచేసుకుంటూ పిల్లలను చదివించుకోడం చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం యూనిఫాం, పుస్తకాలు ఉచితంగా ఇచ్చినా ఇతర ఖర్చులకు డబ్బులు సరిపోయి కావు. ఏడాది క్రితం మా ఆయన మాకు దూరమయ్యాడు. ఈ పరిస్థితుల్లో పిల్లలను చదువు మాన్పిద్దామనుకున్నా. అమ్మ ఒడి పథకంతో ధైర్యం వచ్చి ఆ ఆలోచన విరమించుకున్నా.
– కాటూరి నాగమణి, కొండెవరం శివారు జోగిరాజుపేట, కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా
ఎంతో భారం తగ్గించినట్లయింది
నా భర్త నాని. మాకు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ పిల్లాడు. చదువులేకే కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. మాలా మా పిల్లలు కావొద్దు. పెద్ద చదువులు చదివించాలన్న ఆశ ఉంది. కానీ, అంత ఆదాయం మాకు లేదనేదే ఆవేదన వెంటాడుతోంది. ఈ తరుణంలో అమ్మఒడి పథకం మాకు ఎంతో భారాన్ని తగ్గించినట్లయ్యింది.
– ద్రాక్షారపు చిన్నారి, వాకతిప్ప, కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా
కొండంత ధైర్యం ఇచ్చింది
నా భర్త గురుమూర్తి అనారోగ్యంతో మరణించాడు. నా కుమార్తెలు సౌమ్య ఒకటో తరగతి, అంజలి రెండో తరగతి చదువుతున్నారు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. పిల్లల్ని చదివించడం కష్టంగా మారుతోంది. జగనన్న అమ్మ ఒడి పథకంతో నా పిల్లలిద్దర్నీ చదివించుకోవడానికి వీలుపడింది. ఎటువంటి ఆధారంలేని నాకు ఈ పథకం కొండంత ధైర్యమిచ్చింది.
– సీర నాగమణి, గోకర్ణాపురం, కంచిలి మండలం, శ్రీకాకుళం జిల్లా
పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తా
నా భర్త ముద్దుక్రిష్ణ ఇటీవల అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు చిన్న పిల్లలతో జీవితం కష్టంగా మారింది. పెద్ద కుమారుడు మూడో తరగతి చదువుతుండగా.. చిన్న కొడుకు వాసుదేవ్ అంగన్‌వాడీ కేంద్రంలో చేర్చా. ఎటువంటి ఆధారంలేని నేను జగనన్న అమ్మ ఒడి పథకం కోసం ఎదురుచూస్తున్నా. పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తా.
– రుషవ విమల, కంచిలి, శ్రీకాకుళం జిల్లా
పిల్లల చదువులకు వెసులుబాటు
నా భర్త నాగరాజు దూర ప్రాంతంలో కూలిపనులు చేస్తూ పంపే డబ్బులతోనే కుటుంబం నెట్టుకొస్తున్నా. మాకు ముగ్గురు పిల్లలు. కంచిలి పాఠశాలలోనే మధ్యాహ్న భోజన పథకం వంట పనిచేస్తున్నాను. ఇద్దరు పిల్లలు 5, 6 తరగతులు చదువుతున్నారు. కుటుంబం పోషణ కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో అమ్మ ఒడి పథకంతో పిల్లల చదువులకు కొంత వెసులుబాటు కలుగుతుంది.
– బంగారు లక్ష్మి, కంచిలి, శ్రీకాకుళం జిల్లా
అమ్మ ఒడితో కష్టాలు గట్టెక్కొచ్చు
ఇంట్లో అందరూ పనిచేస్తేగాని ఇల్లు గడవని పరిస్థితి. పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలు, డ్రెస్‌లు ఉచితంగా ఇస్తున్నా ఇతర ఖర్చులు భరించలేక పోతున్నాం. అందుకే పిల్లలు పై తరగతులకు వచ్చేసరికి బడిమాన్పించాల్సి వస్తోంది. ‘జగనన్న అమ్మ ఒడి’ పథకంతో ఆ ఇబ్బంది నుంచి బయటపడొచ్చు.
– గూడుపు లక్ష్మి, విజయనగరం
పిల్లల్ని నిశ్చింతగా చదివించుకోవచ్చు
మా ఆయన ఆటోడ్రైవర్. అందరం ఏదో ఒక పనిచేస్తున్నాం. మా అమ్మాయి 6వ తరగతి చదువుతోంది. పై క్లాసులకు వచ్చిన మా పిల్లని ఈ ఏడాది చదువు మాన్పించాల్సి వస్తుందని అనుకున్నాం. కానీ, అమ్మ ఒడి పథకం ద్వారా ప్రభుత్వం సాయం చేస్తోందని తెలిసి ధైర్యం వచ్చింది. ఇక నిశ్చంతగా పిల్లల్ని చదవించుకోవచ్చన్న భరోసా కలిగింది.
– కప్పరెడ్డి సంతోషి,. విజయనగరం కంటోన్మెంట్
Comments
Please login to add a commentAdd a comment