
కరువు తాండవిస్తోంటే సీఎం ఫిడేలు వాయిస్తున్నారు
- ఏపీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని రాజశేఖర్
గాంధీనగర్ : ‘ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కరువు తాండవిస్తోంది. రాయలసీమ జిల్లాల్లో వలసలు పెరిగి ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయిపోతున్నాయి. రైతులు బతికే పరిస్థితి లేదు. పశువులకు నీళ్లు, గ్రాసం లేక మృత్యువాత పడుతున్నాయి. ఇవేమీ పట్టించుకోని చంద్రబాబు పుష్కరాల్లో జనాలతో కూర్చుని ఫిడేలు వాయించుకుంటున్నా’రని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) ఎద్దేవా చేశారు.
గవర్నర్‌పేటలోని ఆంధ్రరత్న భవన్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెక్రటరీ స్థాయి అధికారి పర్యవేక్షించాల్సిన పుష్కరాలను కంట్రోల్ రూంలో కూర్చుని సీఎం ఆర్భాటం చేస్తున్నారన్నారు. కరువుతో రాష్ట్రం అల్లాడుతుంటే ఎందుకీ పబ్లిసిటీ స్టంట్ అని ప్రశ్నించారు. కరువును ఏ విధంగా అధిగమించాలో ప్రణాళికలు లేవన్నారు. పనుల్లేక వలస వెళుతున్న రైతులను గంజి నీళ్లయినా పోసి బతికించుకోవాలని సూచించారు. కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కరువు సమయంలో పశువులకు గ్రాసం తోలించిన విషయాన్ని గుర్తు చేశారు.
రూ. 500 కోట్ల దోపిడీకి పన్నాగం
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రూ.500 కోట్ల దోపిడీకి పన్నాగం పన్ని అందులో కాంట్రాక్టర్ నుంచి రూ.300 కోట్లు చంద్రబాబు తీసుకున్నాడని దేవినేని నెహ్రూ ఆరోపించారు. తెలుగుదేశం నేతలకు ధైర్యం ఉంటే ప్రాజెక్టు వద్ద అధికారులతో మీటింగ్ పెడితే వాస్తవాలు వెల్లడిస్తామని చెప్పారు. హంద్రీనీవా, గాలేరునగరి, పోతిరెడ్డిపాడు, పులిచింతల ప్రాజెక్టులన్నీ తామే కట్టినట్లు చెప్పుకుంటున్నారని అయితే ఈ ప్రాజెక్టులు ఎప్పుడు నిర్మాణం జరిగాయో పరిశీలించుకోవాలన్నారు.
శ్రీశైలం ప్రాజెక్టులో నీరు లేకపోయినా రాయలసీమకు నీరు ఇస్తానంటూ చిన్నబాబు (మంత్రి దేవినేని ఉమా) ప్రగల్భాలు పలుకుతున్నారంటూ నెహ్రూ ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షుడు మల్లాది విష్ణు, జిల్లా అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు, కొలనుకొండ శివాజీ తదితరులు పాల్గొన్నారు.