
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తా(Rekha Gupta) బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమె ఢిల్లీలోని షాలిమార్ బాగ్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రేఖా గుప్తా ముఖ్యమంత్రి అయిన తర్వాత పలు సవాళ్లను ఎదుర్కొనబోతున్నారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే కీలక బాధ్యత కొత్త ముఖ్యమంత్రిపైనే ఉంటుంది. ప్రస్తుతం రేఖ గుప్తా ముందున్న నాలుగు పెద్ద సవాళ్లు ఇవే..
1. మహిళల ఖాతాల్లోకి రూ. 2500
బీజేపీ తన ఎన్నికల వాగ్దానాలలో భాగంగా మార్చి 8 నాటికి అర్హత కలిగిన మహిళా లబ్ధిదారుల ఖాతాలకు తమ ప్రభుత్వం రూ. 2,500 బదిలీ చేస్తుందని ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తన ఎన్నికల ప్రచార ప్రసంగాలలో ఈ హామీనిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయిన మార్చి 8న మహిళల ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని పేర్కొన్నారు. రేఖ గుప్తా నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇది పెద్ద సవాలుగా నిలిచిందని నిపుణులు అంటున్నారు.
2. యమునా నది శుద్ధి
బీజేపీ గతంలో యమునా నదిని(Yamuna River) శుభ్రపరచడంపై హామీనిచ్చింది. యమునలో కాలుష్యం అధిక స్థాయిలో ఉండటం ఎన్నికల ప్రచారంలో చర్చనీయాంశంగా నిలిచింది. యుమున పరిశుభత విషయంలో కాంగ్రెస్, ఆప్ అధికారంలో ఉన్నప్పుడు చేయలేనిది తాము చేస్తామని బీజేపీ హామీనిచ్చింది. పలు పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు, అనధికార కాలనీల నుంచి వచ్చే మురుగునీరు కారణంగా యమునా నదిలో కాలుష్యం పేరుకుపోతోంది. దీని పరిశుభ్రత కొత్త ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా నిలిచింది.
3. పథకాలకు నిధులు
ఆప్ ప్రభుత్వం అందించిన ఉచిత విద్యుత్, నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో సహా ఇతర సబ్సిడీలు కొనసాగుతాయని బీజేపీ గతంలో హామీనిచ్చింది. కొత్త ప్రభుత్వం రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(ఆర్‌ఆర్‌టీఎస్), ఢిల్లీ మెట్రో వంటి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులలో నెలకొన్న సమస్యలను చక్కదిద్దాల్సి ఉంటుంది. వీటన్నింటికీ నిధులను సమకూర్చడమనేది ఢిల్లీ బీజేపీ ప్రభుత్వానికి భారం కానున్నదనే వాదన వినిపిస్తోంది.
4. రోడ్ల మరమ్మతు- చెత్త కుప్పల నుంచి విముక్తి
గత ఆప్ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం- లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య నెలకొన్న వివాదాల కారణంగా నగరంలో పలు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు నిలిచిపోయాయి. వీటిలో రోడ్డు మరమ్మతుల నుండి చెత్త సేకరణ వరకు అనేక అంశాలు ఉన్నాయి. ఈ పనుల కోసం పట్టణాభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సివుంటుంది. ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టకముందే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: Delhi: సుష్మా, కేజ్రీ, రేఖ.. హర్యానాతో లింకేంటి?
Comments
Please login to add a commentAdd a comment