
సాక్షి, హైదరాబాద్ : సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం అర్చకత్వం ప్రాథమిక హక్కు అని చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకులు, తెలంగాణ దేవాలయాల పరిరక్షణ కమిటీ ఛైర్మన్ సీఎస్ రంగరాజన్ అన్నారు. ఆలయాలకు ఉన్న ఈవోలు మారొచ్చు కానీ అర్చకుడు మారడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఆగమం ప్రకారం ఆలయ ప్రతిష్ట జరిగినప్పుడు అర్చకుడిని నియమించుకుంటారని తెలిపారు. 1996లో చంద్రాబాబు సీఎంగా ఉన్న సమయంలో అర్చకులపై సుప్రీం కోర్టు తీర్పు అమలు చేయలేదని అన్నారు. కానీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1987 పద్దతిని సవరించి అర్చకులను ఆదుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఆ మహానేతకు తాము ఎప్పుడు రుణపడి ఉంటామని తెలిపారు. 2003లో చిలకూరులో ప్రతి ఒక్క భక్తుడు చంద్రబాబు ప్రభుత్వం పోవాలని, వైఎస్సార్ రావాలని ఒక ప్రదక్షిణ అదనంగా చేశారని రంగ రాజన్ పేర్కొన్నారు.
వారి పరిస్థితి దయనీయం : టీటీడీ తీసుకున్న నిర్ణయం కారణంగా చిన్న ఆలయాల అర్చకుల పరిస్థితి దయనీయమౌతుందని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. ధార్మిక పరిషత్ ఆమోదం లేనిదే అర్చకులను మార్చకూడదని అన్నారు. ధార్మిక పరిషత్ ఏర్పాటులో రాష్ట్రం ప్రభుత్వం ఎందుకు అలసత్వం వహిస్తోందని ప్రశ్నించారు. కనీసం చర్చించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందా అని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment