సాక్షి, చీమకుర్తి(ప్రకాశం) : ‘రోడ్లన్ని ధ్వంసమయ్యాయి. కార్మికుల ప్రాణాలకు రక్షణ లేదు. కార్మికులకు వైద్యం అందించేందుకు కనీసం ఆస్పత్రిని ఏర్పాటు చేయలేకపోయారు. తిరిగేందుకు వీధిౖలైట్లు లేవు, తాగేందుకు మంచినీళ్లు కూడా లేవు. మైనింగ్ రూల్స్‌ను అతిక్రమించి నేలను తవ్వి కొండలను తయారు చేశారు. రామతీర్థం, చీమకుర్తి పరిధిలో ఎటు చూసినా గ్రానైట్ వ్యర్థాలతో కూడిన డంపింగ్ యార్డులే’ అంటూ స్థానిక ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రామతీర్థంలో గ్రానైట్ ఫ్యాక్టరీలు, కంకర మిల్లుల యజమానులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధాకర్‌బాబు మాట్లాడుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చాలా పారదర్శకంగా వ్యవహరిస్తుందని, గ్రానైట్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంతో ప్రతి విషయం ప్రభుత్వానికి రికార్డుల ప్రకారం తెలియాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గత ఐదేళ్ల పాటు అధికారం వెలగబెట్టిన ప్రభుత్వాన్ని మీరే పోషించారు. మంత్రులుగా కూడా చెలాయించారు. కానీ స్థానిక కార్మికులకు కనీసం ఆస్పత్రి పెట్టాలనే స్ప్రహా కూడా రాలేదు. మంచినీటి సదుపాయాన్ని కల్పించలేదు. కాలుష్య నియంత్రణకు పచ్చని చెట్లు నాటలేదు. వీధిలైట్లు వేయించలేదు. ఇండస్ట్రీలో జరుగుతున్న మరణాలపై బాధ్యతలేదు. మళ్లీ సమాజంలో పెద్ద నాయకులుగా చెలామణి అయ్యారని గత ప్రభుత్వంలో పెత్తనం చేసిన స్థానిక గ్రానైట్ నేతలను ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఏకిపడేశారు.
మృతుల ఆధారాలే ఉండవు
గ్రానైట్ ఇండస్ట్రీలో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు ప్రభుత్వం సాయం చేద్దామని చూస్తే కనీసం మరణించిన వారి ఊరు పేరు వివరాలు ఉండవు. రేషన్‌కార్డు ఉండదు. తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఎవరు మరణించారో తెలియదు. ఏ రాష్ట్రం వారో తెలియదు. ఇలాంటప్పుడు ఎలా సహాయం చేయాలంటూ ప్రశ్నించారు. కార్మికుల పట్ల ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇది అన్యాయం, అక్రమమంటూ ఫ్యాక్టరీలు, క్వారీల యజమానులు వైఖరిపై ఎమ్మెల్యే సుధాకర్‌బాబు తీవ్రస్వరంతో ధ్వజమెత్తారు. గ్రానైట్ ఇండస్ట్రీలో ఖనిజ సంపదను కొంతమంది చెప్పుచేతుల్లో పెట్టుకొని పరిశ్రమ మొత్తాన్ని శాసిస్తున్నారు తప్ప కార్మికులకు, స్థానిక ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై దృష్టి సారించటం లేదనే ఆవేదనను వ్యక్తం చేశారు. ఎవరైనా మాట్లాడగలిగే వారుంటే ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు వారిని బలవంతంగా నోరుమూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాయల్టీ ధనం ఏమైంది?
స్థానిక ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించేందకు క్వారీలు, ఫ్యాక్టరీల నుంచి వసూలు చేసిన రాయల్టీ ధనం ఆనాటి కలెక్టర్ వద్దకు వెళ్లిన తర్వాత ఏమైనట్లు అంటూ ప్రశ్నించారు. రాయల్టీ ధనం నెలకు రూ.3.30 కోట్లు వసూలు చేశారు. ఏడాదికి అది దాదాపు రూ.36 కోట్లుకు పైగా ఉంది. ఆ ధనం మొత్తం స్థానిక ఇండస్ట్రీ అభివృద్ధికే చెందాల్సి ఉంటే ఏమైందో ఇప్పటికీ అంతుబట్టటం లేదని ఎమ్మెల్యే ఘాటైన స్వరంతో మండిపడ్డారు. ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు, అధికారులు మైనింగ్ రూల్స్‌ను అతిక్రమించి పనిచేశారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులను వదిలిపెట్టే ప్రసక్తేలేదు. తప్పనిసరిగా శిక్షించబడతారని ఎమ్మెల్యే టీజేఆర్ హెచ్చరించారు.
ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా గ్రానైట్ యజమానులు, ఫ్యాక్టరీల యజమానులతో గతంలో ఎప్పుడూ సమావేశాలు నిర్వహించలేదని, ఇప్పుడు తాను ఎందుకు నిర్వహిస్తున్నానంటే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన మార్పు ఇదే...అంటూ ప్రభుత్వ విధానాన్ని తెలియజెప్పారు. ఇప్పటికైనా యజమానులు తమ వద్ద పనిచేసే కార్మికుల వివరాలను రికార్డుల ద్వారా పూర్తిగా సమాచారం నమోదు చేయడమే కాకుండా ప్రభుత్వానికి అందజేయాలని తెలిపారు.
యజమానులకు ఏమైనా అనుమానాలు ఉంటే నేరుగా తనతోనే మాట్లాడవచ్చని, తనకు పీఏలు ఎవరూ లేరని, ఏ సమయంలోనైనా, ఎవరితోనైనా నేరుగా మాట్లాడతానని, తన వద్ద పనులు చేసి పెడతామని చెప్పి ప్రలోభాలకు గురిచేసేవారి మాటలు నమ్మవద్దని, నేరుగా తనకే ఫోన్ చేయాలంటూ తన ఫోన్ నంబర్ 9866075828 అంటూ ఫ్యాక్టరీల యజమానులు, కంకరమిల్లుల యజమానులకు తెలియజేశారు. తొలుత గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులు తమ సమస్యలైన ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని, డంపింగ్ యార్డును కల్పించాలని, ఫ్యాక్టరీలకు నీటి వసతి కల్పించాలని, రాకపోకలకు వీలుగా రోడ్లు నిర్మాణం చేపట్టాలనే డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ఎమ్మెల్యే సుధాకర్‌బాబుకు అందించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రమణయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డి, ఫ్యాక్టరీల యజమానులు మల్లినేని వెంకటేశ్వర్లు, మస్తాన్‌రెడ్డి, మేడగం రామకృష్ణారెడ్డి, ప్రసాదరెడ్డి ఫ్యాక్టరీల యజమానులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment